11, ఆగస్టు 2007, శనివారం

చీమలు ఎప్పుడు పరిగెడుతాయి?

మొన్న మా అన్నయ్య వాళ్ళింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మాయి అడిగింది..
"బాబాయ్, చీమలు ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి.. అవి అలిసిపోవా?" అని.
నేను చెప్పాను.. "మొదట అన్ని కీటకాలకి, పక్షులకి, జంతువులకి, మనుషులతో సహా.. రెండు కాళ్ళే ఉండేవి. అప్పుడు జంతువులు దేవుడిని ప్రార్దించి మనుషులు మమ్మల్ని పని చేయిస్తారు కాబట్టి చేతులని కూడా కాళ్ళగా మార్చమని ప్రార్దించాయి. అలా జంతువులకి నాలుగు కాళ్ళు వచ్చాయి. ఇక కీటకాల్లో ఉన్న చీమలు కూడా దేవుడి కోసం తపస్సు చేశాయి. దేవుడు ప్రత్యక్షమయినాక అడిగాయి కదా.. 'ఓ దేవా! మనుషులకేమో రెండు కాళ్ళిచ్చావు.. జంతువులకేమో నాలుగు కాళ్ళిచ్చావు.. అందరికన్నా చిన్న వాళ్ళమనే కదా మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నావు. మాకు ఇంకో రెండు కాళ్ళు ఇవ్వు.' అని అడిగాయి. దేవుడు వద్దు అన్నా కూడా వినకుండా వరం తీసుకున్నాయి. ఇక అప్పుడు సంతోషంతో పరుగెత్తటం మొదలు పెట్టాయి. ఆరు కాళ్ళు కదా.. ఒక దానికి ఒకటి అడ్డం వచ్చి ముందుకి పడ్డాయి. అలా పడటం తోనే వాటి కళ్ళు కాస్తా బయటకు వచ్చేశాయి.
అందుకే ఎవరైనా సరిగా నడవక పోతే 'కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నావా?' అని అడుగుతున్నారు అప్పటినుంచి.
పాపం చీమలు.. అప్పటినుంచి పరుగెత్తలేక అలానే నడుస్తున్నాయి.. ఎప్పటికైనా దేవుడు మళ్ళీ కరుణించక పోతాడా.. అని. అందుకే అత్యాశకి పోకూడదు" అని ముగించాను.

అర్దమైందా, చీమలు ఎందుకు పరిగెత్తవో??

8, ఆగస్టు 2007, బుధవారం

పెన్సిల్ తో నా మొదటి కుస్తీ


డాన్ బ్రౌన్ ("ది డావిన్సి కోడ్" రచయిత)రచించిన "ఏంజెల్స్ & డెమాన్స్" అను నవల లోని కొన్ని "ఆంబిగ్రాంస్" ని చూసి, విశేషంగా ఆకర్షింపడి నాకోసం నేను గీసుకున్న నా కలం పేరు ఇది.దీనికి నాకు సుమారు ఆరు గంటల సమయం పట్టిందనుకోండి.. అది వేరే విషయం.

""ఆంబిగ్రాం" అనగా.. పైనుంచి చూసినా, కిందినుంచి చూసినా ఒకేలా కనిపించే అక్షర చిత్రము."

ఆఫీసులో రోజుని సంతోషంగా మొదలుపెట్టుటకు ఒక మార్గము

ఆఫీసులో మీ రోజుని సంతోషంగా మొదలుపెట్టుటకు ఒక మార్గము:
1. మీ పి.సి.ఆన్ చేయండి.
2. అందులో ఒక కొత్త ఫైలు ఓపెన్ చేయండి.
3. దానికి "బాసు" అని పేరు పెట్టండి.
4. దానిని "డిలీట్" చేయండి.
5. అప్పుడు రీసైకిల్ బిన్ ను ఎంప్టీ చేయండి.
6. మీ కంప్యూటర్ అడుగుతుంది... "బాసు ని పూర్తిగా నాశనం చేయనా??" అని.
7. సంతోషంగా "యస్" అని నొక్కండి.
8. ఇంకేం మీ బాసుని నాశనం చేసిన ఆనందంలో మిగిలిన పని కానివ్వండి.
.
.
.
.
.
.
కాని అక్కడ మీ బాసు లేకుండ జాగ్రత్త పడండి.


ఇలా మీ బాసునే కాదు.. ఇంట్లో అత్తని, టైం కి రాని మీ కాబ్ డ్రైవర్ ని, ఎప్పుడు డబ్బులు అడిగే పక్క సీటు పరమేశాన్ని.. లేదా సొల్లు కబుర్లు చెప్పే నన్నైనా సరే డిలీట్ చేసి పారేయండి. ఆనందంగా మీ సమయాన్ని ఇంకొంచెం ఎక్కువ సంతోషంగా గడపండి.

ప్రతి చిన్నవారికీ ఓ కుటుంబం కావాలి!!




అవును..ప్రతి చిన్నవారికీ ఓ కుటుంబం కావాలి!!
పెద్ద వాళ్ళు చిన్న చిన్న గొడవలతో విడిపోతే?
ఆ తప్పుకి శిక్ష ఎవరు అనుభవించాలి?
మరి ఎవరు అనుభవిస్తున్నారు?
గొడవలకి దూరంగా, అమ్మ జోలలో, నాన్న లాలనలో ఆడుకోవలసిన చిన్నపిల్లలు ఎందుకు ఇంటి నుండి దూరంగా పారిపోతున్నారు? ఎందుకు అమ్మ నాన్న ల మాట వినకుండా మొండిగా, పెంకిగా తయారవుతున్నారు??

అందుకే ప్రియ నేస్తం..మీ చుట్టుపక్కల అటువంటి పిల్లలు వుంటే కాసేపు వాళ్ళని పలకరించండి. వాళ్ళతో మట్లాడండి. కొద్దిగా ప్రేమని పంచండి. ఎందుకంటే మనం ఎలాగూ వాళ్ళ తల్లిదండ్రులని మార్చలేం కదా!!

ఎప్పటికీ తేలని ముక్కోణపు ప్రేమ కధ!!

సూర్యుని చుట్టూ భూమి..
భూమి చుట్టూ చంద్రుడు..
ఇది ఒక ముక్కోణపు ప్రేమ కధ!!

7, ఆగస్టు 2007, మంగళవారం

వర్షం ఎలా పడుతుంది?

ఒక ముందు మాట నేస్తం.. ఈ టపాని చూసి నవ్వుకోండి కాని.. దయచేసి నన్ను చూసి నవ్వద్దు..

ఇక అసలు విషయానికి వస్తే...

మొన్నామధ్య, నా ప్రేయసికి మళ్ళీ కోపం వచ్చింది. ఏం చేస్తాం, కోపాలేమో వాళ్ళకు.. తాపాలేమో మనకు కదా..
అప్పుడు విషయం మార్చటానికి, నా తెలివిని తీసుకెల్లి కలగలుపు యంత్రం (అదేనండి.. వంటింట్లో వుంటుందీ.. మిక్సీ) లో వేసి తిప్పీ తిప్పీ చివరికి ఈ చిన్ని కధ చెప్పా.. (కధ మాత్రమే!!)..

వర్షం ఎలా పడుతుంది??

ఒకప్పుడు, తెల్ల రంగుకి చాలా గర్వం వచ్చింది.
మిగిలిన రంగులని చూసి, నవ్వుతూ అంది కదా..
"నేను అన్ని రంగులకి అమ్మని, అమ్మమ్మనీ.. నేను లేనిదే ఏ రంగు లేదు. దేవుడికి కూడా నేనంటేనే ఇష్టం. అందుకే తెల్ల రంగు బట్టలనే వేసుకుంటాడు. నేనే రంగులన్నింటికీ రాజుని." అంది. అంతేనా, పాపం కొన్ని రంగులని మరీమరీ ఏడిపించింది. మరి రంగుల్లో కూడ సున్నిత మనస్సున్న రంగులు ఉంటాయి కదా.. అవి తట్టుకోలేక ఆత్మ త్యాగం చేసుకుంటూ నల్ల రంగుకి ప్రాణం పొశాయి. తర్వాత కొన్నాళ్ళకి నల్ల రంగుకి జన్మ రహస్యం తెలిసి తెల్ల రంగుపై యుద్ధం ప్రకటించింది.
యుద్ధంలో నల్ల రంగు తెల్ల రంగుతో అంది కదా..
"నేను అన్ని రంగులని నాశనం చేసేంత శక్తి ఉన్న దానిని. నాతో పెట్టుకోకు.. నేను ఆక్రమిస్తే ఏ రంగు కూడా మిగలదు..నువ్వు రంగులకి రాజువి ఐతే నేను రంగుల చక్రవర్తిని.. జాగ్రత్త" అని తెల్ల రంగు వెంట పడింది. తెల్ల రంగుకి భయం వేసి ఆకాశంలోకి పరుగెత్తి మేఘాల్లో దాక్కుంది. దాని వెంట నల్ల రంగు కూడా పడింది. మేఘాల్లో ఇద్దరి మధ్య యుద్ధం జరిగి చివరికి తెల్ల రంగు ఏడుస్తూ వర్షంలా కిందకి పడిపోయింది.

నల్ల రంగు మేఘాల్లోంచి వెళ్ళిపోగానే, మళ్ళీ మేఘాల్లోకి వెల్లేది తెల్ల రంగు.

అదిగో అలా వర్షం పుట్టింది.

నల్ల రంగు తెల్ల రంగుని ఆక్రమిస్తే వర్షం పడుతుంది.
అంతే కదా.. తెల్లగా ఉన్న మేఘాలు నల్లగా మారితేనే కదా.. వర్షం పడేది?
ఆ రెండు రంగుల మధ్య జరిగే యుద్ధం కి గుర్తే ఉరుములూ, మెరుపులూ మరియు పిడుగులూనూ..

బాగా చెప్పానా??

4, ఆగస్టు 2007, శనివారం

స్నేహితుల రోజు శుభాకాంక్షలు!

ఓ నేస్తమా!
నీకు ముందుగా స్నేహితుల రోజు శుభాకాంక్షలు!!
ఆడు.. పాడు.. అందరితో ఆనందాన్ని పంచుకో.. మనదైన ఈ రోజు..!!!

తెలివైన వాడినట నేను!!

ఆకాశం లో చుక్కలన్నీ ఓనాడు దేవదేవుని వద్దకు వెళ్ళాయి..
అన్నాయి కదా.."ఓ దేవా! సూర్యుని వలన మేము పగలు ఎవరికీ కనిపించకుండా పోతున్నాము.. ఇది అన్యాయం కాదా?" అని.
అప్పుడు దేవుడు.."ఆగండాగండి.. మనుషుల మధ్య ప్రేమలు మాత్రం అందరికీ కనిపించేలా ఉంటున్నాయా? అవి ఉన్నాయన్న నమ్మకమే ఈ సృష్టిని నిలబెడుతున్నాయి. అలాగే మీరు కనిపించక పోయినా మీకోసం ఎదురు చూసే ఎందరో భావుకులని నేను సృష్టించేశాను. బెంగ పడవద్దు.." అని చెప్పి వాటిని పంపేశాడు..

ఇదిగో ఇలా నేను నా ప్రియురాలిని సముదాయించాను, తను "నా మీద ప్రేమ తగ్గిపోయింది" అని గొడవ చేసినప్పుడు.
అప్పుడు అంది తను, "తెలివైన వాడివే నువ్వు.." అని.


ఏం దోస్త్? ఇలా కూడా అమ్మాయిలని శాంత పరచవచ్చా??

వందనం.. అభివందనం!!

ఎందరో మహానుభావులు.. అందరికీ వందనములు..
ఎప్పుడో సృష్టించి వదిలేసిన నా బ్లాగును మళ్ళీ నిద్రావస్థ నుండి మేల్కొలపటానికి చాలా సమయమే పట్టింది. బహుశా రెండు సంవత్సరాలు.
ఇంత కాలం ఏం చేసావ్ సోదరా అని మీరడిగితే నా దగ్గర సమాదానం ఉండదు కనుక దయ చేసి అడగకండి.
మరి ఇప్పుడు మాత్రం ఈ బ్లాగు ఎందుకయ్యా అంటే.. నాలోని నసగాడిని నిద్రపుచ్చటానికే అని చెప్పవచ్చు. ఇక నుండి నా బ్లాగుని వీలున్నప్పుడల్లా నింపుతూ జనాన్ని హింసించేందుకు కావాల్సిన అన్ని రకాల ఆయుధాల్ని సమకూర్చుకుంటానని మాత్రం ఈ మొదటి టపాలో చెప్పగలను.

ఇందులో నేను కృతజ్ఞతలు తెలియజేయవలసిన వారు వున్నారు..
వారు.. నేనిలా మన మతృభాషలో మిమ్మల్ని ఉప్పు కారం లేకుండానే తినటానికి సాహసించేలా చేసిన
లేఖిని
వీవెన్ వీరపనేని మొదలగు వారు.

ఎందరో మహానుభావులు.. అందరికీ ధన్యవాదములు.