మొన్న మా అన్నయ్య వాళ్ళింటికి వెళ్ళినప్పుడు వాళ్ళ అమ్మాయి అడిగింది..
"బాబాయ్, చీమలు ఎప్పుడూ నడుస్తూనే ఉంటాయి.. అవి అలిసిపోవా?" అని.
నేను చెప్పాను.. "మొదట అన్ని కీటకాలకి, పక్షులకి, జంతువులకి, మనుషులతో సహా.. రెండు కాళ్ళే ఉండేవి. అప్పుడు జంతువులు దేవుడిని ప్రార్దించి మనుషులు మమ్మల్ని పని చేయిస్తారు కాబట్టి చేతులని కూడా కాళ్ళగా మార్చమని ప్రార్దించాయి. అలా జంతువులకి నాలుగు కాళ్ళు వచ్చాయి. ఇక కీటకాల్లో ఉన్న చీమలు కూడా దేవుడి కోసం తపస్సు చేశాయి. దేవుడు ప్రత్యక్షమయినాక అడిగాయి కదా.. 'ఓ దేవా! మనుషులకేమో రెండు కాళ్ళిచ్చావు.. జంతువులకేమో నాలుగు కాళ్ళిచ్చావు.. అందరికన్నా చిన్న వాళ్ళమనే కదా మమ్మల్ని చిన్న చూపు చూస్తున్నావు. మాకు ఇంకో రెండు కాళ్ళు ఇవ్వు.' అని అడిగాయి. దేవుడు వద్దు అన్నా కూడా వినకుండా వరం తీసుకున్నాయి. ఇక అప్పుడు సంతోషంతో పరుగెత్తటం మొదలు పెట్టాయి. ఆరు కాళ్ళు కదా.. ఒక దానికి ఒకటి అడ్డం వచ్చి ముందుకి పడ్డాయి. అలా పడటం తోనే వాటి కళ్ళు కాస్తా బయటకు వచ్చేశాయి.
అందుకే ఎవరైనా సరిగా నడవక పోతే 'కళ్ళు నెత్తి మీద పెట్టుకుని నడుస్తున్నావా?' అని అడుగుతున్నారు అప్పటినుంచి.
పాపం చీమలు.. అప్పటినుంచి పరుగెత్తలేక అలానే నడుస్తున్నాయి.. ఎప్పటికైనా దేవుడు మళ్ళీ కరుణించక పోతాడా.. అని. అందుకే అత్యాశకి పోకూడదు" అని ముగించాను.
అర్దమైందా, చీమలు ఎందుకు పరిగెత్తవో??
తాళి
12 సంవత్సరాల క్రితం