30, జులై 2009, గురువారం

శశిరేఖ

sasirekha2

గుడిపాటి వెంకటాచలం పేరు తెలియని తెలుగు భాషాభిమాని ఉన్నాడంటే నాకు నిజంగా ఆశ్చర్యమే. చలంపై మీకెటువంటి అభిప్రాయమైనా ఉండవచ్చు. కానీ అతను ఒక ప్రవాహానికి పాదులు తీశాడు. తెలుగు భాషను శాసించాడు. సంఘాన్ని ధిక్కరించాడు. అవసరమైనప్పుడల్లా తన నాయికల గొంతుతో ప్రశ్నించాడు. చలంకు "శశిరేఖ" మొదటి నవలే అయినా అప్పటి సంఘపు నీతి నియమాలను ప్రశ్నించాడు. కానీ అవే పద్ధతులు ఇప్పటికీ కొనసాగటం గమనార్హం. సమాజాన్ని, కట్టుబాట్లను ఒంటరిగా ఎదిరించేందుకు సాహసించిన చలం తన మిగిలిన రచనల్లో ఆ పద్ధతిని కొనసాగించాడు.
చలం తన ఆత్మ కథలో వ్రాసుకున్నది ఆయన శైలి గురించి కొంత తెలియచేస్తుంది:
"నేను రచనలు సాగించేటప్పటికి నాకు తెలీకుండానే, నేను మాట్లాడే భాషలోనే రాశాను. తక్కిన కథలని పుస్తకాల భాషలో రాశాను. అసలు ఆనాడు భాషా ఉద్యమం అనేది ఒకటి ఉందని నాకు తెలీదు. చింతా దీక్షితులు (ఈయన కూడ రచయిత, చలంగారికి సహ ఉద్యోగి) గారినించే విన్నాను గిడుగు రామ్మూర్తి గారి పేరు. వారి శిష్యులు ఆలోచించి, భాషని ఎంతవరకు మార్చవచ్చో తూచి రాసేవారు. ఆ యత్నాలు, మడి కట్టుకోటాలు చదివితేనే నాకు అసహ్యం వేసింది. భాష ఎట్లా మారాలో నాకు శాసించాలని చూసేవారు. భర్తని యెన్ని ముద్దులు పెట్టుకొవాలో శాసించినట్లు. కాని ఈ చలం ఓ వరదల్లె వూడ్చుకొచ్చాడు. నా భాషాధాటికి వారికెంత భయమో! పైగా ఆ భాష, భయంలేని, సంకోచంలేని, భీతిలేని, పాత గోడల్ని పడగొట్టే తీవ్రవాది ఓ master stylist చేతిలో పడ్డది. చాలా త్వరలో వీళ్ళ కృతక భాషలన్నీ కుప్పకూలాయి. చలం శైలిలో, రాతలో అంత తీవ్రత అంత inevitibility అంత భయంకరాకర్షణ ఉండిపోయింది. ఒక్కొక్కరే ప్రతిఘటించబోయి, పరాజితులై, నా భాషనే అనుకరించారు గతిలేక. ఇంకో విధంగా రాస్తే వాటిని చదవరు ఎవ్వరూ. ఈ భాష, ఈ భావాలు వీలులేదు అని ఎంతమంది మొత్తుకున్నా, ప్రజలు ఎగబడి చదువుతున్నారు. రచయితలు, పత్రికలు చలం పేరు చెప్పకుండా చలాన్ని అనుకరించటం ప్రారంభించారు. భాషాదిగ్గజాల మొకాళ్ళూగిసలాడే పాత నీతుల గోడలు విరిగి కింద కూలాయి." (ఆత్మకథలో 74-75వ పుటలు)
అటువంటి చలం 1921లో వ్రాసిన నవల "శశిరేఖ". నూటయాభైరెండు పేజీల ఈ నవలను సంక్షిప్తీకరిస్తే..
శశిరేఖ- చలం మాటల్లో చెప్పాలంటే ఏమీ తెలియని ముగ్ధ. అప్పుడే మారుతున్న సమాజంలో నవతరానికి ప్రతినిధిగా కనిపిస్తుంది మొదట్లో. చిన్న వయసులో తనకు ఏమాత్రం ఇష్టం లేని పెళ్లి చేసినందుకు అమ్మతో వాదనకు దిగుతుంది. తనను ఇష్టపడిన రామారావు సీమనుండి వచ్చి తనను వివాహం చేసుకునేవాడు గదా అని ప్రశ్నిస్తుంది. తనకు ఇష్టంలేని వాడితో "కార్యం"కు ఎలా ఒప్పుకోనంటూ నిలదీస్తుంది. థైర్యంగా భర్తతో చెబుతుంది. "నువ్వంటే ఇష్టం లేదు, కార్యం ఇష్టం లేదు, బలవంతం చేయటం న్యాయమా..?" అని. అతను అర్ధం చేసికొనక పోవటంతో కార్యం ముందురోజు రాత్రి తాను ఇష్టపడిన గోవిందపురం లాకుల అధికారి కొడుకు, కృష్ణుడితో ఊరు వదలి వాడపిల్లి వచ్చేస్తుంది.
కృష్ణుడు-శశిరేఖ, ఇద్దరూ ప్రకృతి ప్రేమికులు. అందాన్ని ఆస్వాదిస్తూ అన్నపానాలను మరచిపోయేవాళ్లు. కృష్ణుడు శశిరేఖ తనతో ఉంటే చాలుననుకుంటాడు. ఆమె కోసం వైద్యవిద్యను మధ్యలో వదిలేసి వచ్చేస్తాడు. అప్పుడే పూసిన మొగ్గల్లే ఉన్న తనని అపురూపంగా చూసుకుంటాడు. ఒకరికి ఒకరు ఎదురు ఉంటే చాలు ఆకలిదప్పులు ఉండవనుకుంటారు. వాడపిల్లిలో ఉన్న కృష్ణుడి మితృడు, డాక్టరు సుందర రావు ఆశ్రయం పొందిన వీరు ప్రకృతిని ఆస్వాదిస్తూ కాలం గడిపేస్తారు. మూడేళ్ల తర్వాత తిరిగి సొంతఊరు గోవిందపురం వచ్చేస్తారు, మితృడు సుందర రావుతో సహా!
ఒకనాటి రాత్రి పడవలో షికారుకి వెళ్లినప్పుడు కాలువలో పడిపోతుంది. సుందర రావు దగ్గర వైద్యం చేయించుకుంటుంది. సుందర రావుకి ఆమెపై కోరిక ఉండటం, తనకూ అతనంటే ఇష్టం కలగటం వలన బలవంతంగా అతనితో ఒకరాత్రి గడుపుతుంది. కృష్ణుడిపై ప్రేమ తగ్గిపోయినప్పుడు అతని వద్ద ఉండటం నీతి కాదని సుందర రావుతో ఊరువదలి వచ్చేస్తుంది. తనకోసం ఎదురుచూస్తున్న కృష్ణుడికి తనను మరచిపొమ్మని చీటీ పంపిస్తుంది.
ఈ సంఘటనకు ఉపోధ్ఘాతముగా, చలం అంటాడు.. "ఆమె పాదములకు నమస్కరించి, తాకిన ఆమె దేహమెక్కడ కందునో అని ఆమెను దేవతగ పూజించు భక్తునితో ఆమెకవసరము తీరినది. ఆమెను నలిపి జీవన రసమును పిండి, తాగి మూర్ఛనొందించగల ప్రేమనామె వాంచింఛెను. అగ్ని వలె తాపమున దహించు తృష్ణకు, ఉపశమనముగ మహా ప్రళయ, మేఘముల గర్జించు చండవర్షమే కావలెను."
శశిరేఖతో ఎన్నో అందమైన ప్రదేశాలు తిరిగిన తర్వాత సుందర రావు బళ్లారిజిల్లాలో ఉద్యోగంలో చేరుతాడు. కాలం గడచిన కొద్దీ, ఆమెను అనుభవించిన కొద్దీ శశిరేఖపై మోహం పోయి ఆమె అతనికి భారంగా కనిపిస్తుంది. అందముగా కనబడేకొద్దీ ఆమెను మాటలతో హింసించాలని చూస్తాడు. చివరికి అతనిపై ప్రేమ మాయమై, అతనిని విడిచి తిరిగి గోవిందపురం వెళ్లటానికి బయల్దేరుతుంది. కానీ సుందర రావుకి ప్రమాదం జరగటం వలన ఆగిపోవలసి వస్తుంది. నెలరోజులపాటు అతనికి సేవలు చేసి ఆరోగ్యం కుదుటపడేలా చేస్తుంది. ఫలితంగా అతను ఆమెతో మళ్లీ ప్రేమగా ఉండాలనుకుంటాడు. సుందర రావుకి వైద్యం చేస్తున్న డాక్టరుని ఎక్కడో చూసిన గుర్తుతో వివరాలు సేకరిస్తుంది. అతనే తనను పెళ్లి చేసుకుంటానన్న రామారావని తెలుసుకుని స్నేహం చేస్తుంది.
రామారావుకి తన గతం గురించి చెప్తుంది శశిరేఖ. బ్రహ్మ సమాజంలో తిరిగే అతను ఆమెను పెళ్లి చేసుకుంటానంటాడు. సుందర రావుని వదలి తనతో వచ్చేయమంటాడు. తీసుకెళ్లి వేరే ఇంటిలో ఉంచి పదిహేనురోజుల తర్వాత పెళ్లి అంటాడు. తనతోపాటే ఉంటానంటుంది శశిరేఖ. పెళ్లికి ముందు కలిసి ఉండటం సమాజం హర్షించదంటాడు రామారావు. ఈలోపు సుందరరావు వస్తాడు. పాతవన్నీ గుర్తు చేసి శశిరేఖను చెన్నపట్నం తీసుకునిపోతాడు. ఆమె తనమీద ఆధారపడి ఉన్నదన్న అహంకారంతో మళ్లీ హింసించటం మొదలుపెడతాడు.
సుందర రావుమీద అసహ్యంతో ఇల్లు వదలి వచ్చిన శశిరేఖను బ్రహ్మమత ప్రచారకుడు, నవజివనదాసు ఆదరిస్తాడు. కన్న బిడ్డలా చూసుకుంటాడు. ఆమె గతం తెలుసుకున్న తర్వాత తనకు తెలిసిన ధర్మారావుతో పెళ్లి చేద్దామనుకుంటాడు. కాని, పెళ్లి మీద ఏమాత్రం నమ్మకం లేని శశిరేఖ గట్టిగా వ్యతిరేకిస్తుంది. ప్రేమ లేని చోట తానుండలేనని, పెళ్లి అంటే ప్రేమను వదులుకోవటమే అంటుంది. అడవిలో స్వేచ్చగా తిరిగే చిలుకను పంజరంలో బంధించటమే పెళ్లి అంటుంది.
తన మనసు మార్చేందుకు బ్రహ్మ సమాజ కార్యక్రమాలకు హాజరుకావాలని కోరతాడు నవజీవన దాసు. కలకత్తాలొ జరిగే సమావేశాలకు హాజరైతే ఆమె గతంలో చేసిన తప్పులను తెలిసికొంటుందనీ, ఈశ్వర ప్రేమకు పాత్రురాలవుందనీ తద్వారా.. ధర్మారావుని పెళ్లి చేసుకుంటుందని ఆశిస్తాడు.
అప్పటికే బ్రహ్మసమాజంలో ఉన్న రామారావు, శశిరేఖను కలకత్తాలో కలుస్తాడు. తనను మోసం చేసిందని నిందిస్తాడు. "నా మనసు నీకే అర్పితం" అంటుంది శశిరేఖ. బ్రహ్మ సమాజంలోని వారిని చూసి ఎంత సంతొషముగా ఉన్నారో అని అనుకుంటుంది. తనను పెళ్లి చేసుకుంటే ఇక్కడే ఉండిపోయేలా ఏర్పాట్లు చేస్తానంటాడు ధర్మారావు. తన మౌనాన్ని అంగీకారంగా భావించిన ధర్మారావు నవజీవనదాసుతో శశిరేఖ పెళ్లికి ఒప్పుకుందని చెప్తాడు.
ఈవిషయం రామారావుకి తెలిసి శశిరేఖను నిలదీస్తాడు. తను, "నేను నీ సొంతం" అంటుంది. పెళ్లికి మాత్రం ఒప్పుకోకుండా తనతో ఉండిపోమంటుంది. మగ స్నేహితుల వలే కలిసి ఉందామంటుంది. వివాహమనే బంధం లేకుండా స్త్రీపురుషులు కలిసి ఉండటాన్ని సంఘం హర్షించదంటాడు రామారావు. పెళ్లి చేసుకునేందుకు ఒప్పుకోమంటాడు. చిన్నప్పుడు చేసిన వాగ్దానాన్ని నిలుపుకునేందుకే తనను పెళ్లి చేసుకుంటానంటున్నావంటుంది శశిరేఖ. సాయంత్రం లోపు నిర్ణయం చెప్పమని వెళ్లిపోతాడు రామారావు.
ఆరోజు సాయంత్రం శశిరేఖ రామారావుని శారీరకంగా కూడా కలుస్తుంది. అంతా అయిపోయాక కళ్లుతెరిచిన రామారావు ఆమెను అక్కడే వదిలేసి వెళ్లి పోతాడు. తన తప్పు తెలుసుకుని తిరిగివచ్చేసరికి ఆమె కొన ఊపిరితో ఉంటుంది. చివరికి అతని చేతిలో కన్నుమూస్తుంది.
———————————————————–
ఈ నవలలో ఉన్న ప్రధాన పాత్రలు ఐదు.
శశిరేఖ, కృష్ణుడు, సుందర రావు, రామారావు, నవజీవన దాసు.
ముందు మాటలో శివశంకర శాస్త్రి అన్నట్లు.. శశిరేఖ ప్రేమైక జీవిని. ప్రేమ లేని చోట తను ఒక్క నిమిషం నిలువలేకపోయింది. రామారావు వచ్చి తనను పెళ్లి చేసుకుంటాడనుకున్న ఆమే.. పెద్దవాళ్లనెదిరించి కృష్ణుడితో వెళ్లిపోయింది. సుందర రావు ఫిడేలు గానం, తీయని మాటల ప్రభావంతో.. అతనిపై ఆకర్షణ పెంచుకుంది. అందము, సౌందర్యారాధనలొ మునిగిపోయే ఆమె అతని ప్రభావంలో పడిపోయింది. ఆవేశంలో అతను ముద్దుపెట్టి, తర్వాత కోపం ఉందా అంటే లేదని చెప్పింది. ఆసుపత్రి నుండి ఇంటికి వెళ్లే ముందు రోజు రాత్రి ఒంటరిగా సుందర రావు ఇంటికి వెళ్లింది. వయసు గారడీ, అతని బలవంతము వలన లొంగిపోయింది. ఉదయం కృష్ణుడి దగ్గరకే వెళ్లమనిన సుందరరావుతో.. "నాకు నీమీద ప్రేమలేకపోతే నా చిటికిన వేలునైనా తాకనిచ్చేదాన్నా మిమ్మల్ని?" అని ప్రశ్నిస్తుంది. అప్పటి వరకు తననెంతో ప్రేమగా పూజించిన కృష్ణుడిని వదలి వెళ్లుటకు ఇష్టంలేకపోయినా.. అతనంటే ఇప్పుడు ప్రేమ లేదు కనుక ఇంకా అతనితో ఉండటం భావ్యం కాదని భావించింది. సుందరరావుతో ఊరు విడిచి వెళ్లిపోయింది. మోహం తీరిన సుందరరావు కౄరత్వాన్ని చూచిన ఆమెకు అతనిపై ప్రేమ తగ్గిపోయింది. తర్వాతి పరిణామాల వలన చిన్ననాటి మితృడు రామారావుతో కలిసి జీవించాలనుకుంటుంది. అతను పెళ్లికి పట్టుపడితే.. పెళ్లి తర్వాత ఇతను మాత్రం వదిలేయడని ఋజువేంటని ఆలోచిస్తుంది. పెళ్లి అంటే స్వాతంత్ర్యమును కోల్పోవటమేనని, "ఒకవేళ పెళ్లితర్వాత ఇప్పుడున్న ప్రేమ పోతే నన్ను ఇష్టం వచ్చినట్లుగా పోనిస్తారా?" అని అడుగుతుంది. తప్పనిసరై పెళ్లికి ఒప్పుకున్నా, సుందర రావు బలవంతముతో మళ్లీ అతనితో వెళ్లిపోతుంది. చెన్నపట్నంలో నవజీవనదాసు ఆశ్రయంలో కొన్నాళ్లు సంతోషంగానే గడిపినా, తనకు పూర్వ జీవితమే బాగుందనిపిస్తుంది. కలకత్తాలో రామారావును మళ్లీ కలిసిన తర్వాత అతని ప్రేమ తప్ప మరేమీ అక్కరలేదనిపిస్తుంది. ఓక రాత్రి అతనితో కలిసిన తర్వాత, అతని ప్రేమను తట్టుకోలేక గుండెనొప్పితో కన్నుమూస్తుంది.
కృష్ణుడు అందాన్ని ఆస్వాదించే వాడైతే.. సుందరరావు అనుభవించాలని చూసేవాడు. కృష్ణుడు శశిరేఖ అమాయకత్వాన్ని, అందాన్ని, దోసిలిలో పట్టి ప్రేమగా చూసుకుంటే.. సుందర రావు ఆమె శరీరాన్ని గుప్పెటలో నలిపి వేశాడు. తనను వదిలి వచ్చిన తర్వాత శసి క్షేమం కోరుతూ కృష్ణుడు ఉత్తరం వ్రాస్తే.. సుందర రావు మోహం తీరిన తర్వాత ఇంట్లోంచి బయటకు గెంటివేసాడు. వీళ్లిద్దరూ భిన్నదృవాళ్లా, నాణేనికి చెరో వైపులా కనిపిస్తారు. శశిరేఖ కృష్ణుడి వద్ద ఉన్నంతకాలం ఆమె కోసం వెంపర్లాడిన సుందరరావు, ఆమె తనతో వచ్చేయగానే ఆమె ఎక్కడికి పోతుందన్న నిర్లక్ష్యము ఏర్పడింది. కొన్నాళ్లకు ఆమె మోయలేని బరువుగా తోచింది. ఫలితంగా ఆమెకు దూరమైనాడు.
రామారావు అప్పటి బ్రహ్మసమాజపు ప్రతినిధి. ఉన్నత విద్యలు చదివినా సంఘం నిర్మించిన చట్రాన్ని, గీసిన గీతను కాదనే సాహసం చేయలేకపోయాడు. చిన్నప్పుడు శశిరేఖకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని తపించినా, ఒక చెడిపోయిన స్త్రీని బాగుచేశానన్న పేరు కోసమే అతను నడచుకున్నట్లు కనిపిస్తుంది. వెలుతురులో ఎన్నో ఆదర్శాలు పలికే వారు చీకటిలో తప్పులు ఎలా చేస్తారో, నిగ్రహాన్ని ఎలా కోల్పోతారో రామారావు మనకు కళ్లకు కట్టినట్లు చూపిస్తాడు.
నవజీవనదాసు బ్రహ్మసమాజపు ప్రచారకుడు. తప్పుడుదారిలొ నడచే అమ్మాయిని బాగుచేసి, పాపాలకు పరిహారం చూపి, ఆమెకు ఒక కొత్త జీవితం ఇవ్వాలని ఆశించాడు. ఐతే ధర్మారావుతో ఆమె పెళ్లికి నిరాకరించటం, రామారావుతో సన్నిహితంగా మెలగటం అతనికి కోపం తెప్పిస్తుంది. కాని, ఆమె తన కూతురివంటిదనీ, ఆమె కోరుకున్న జీవితం గడపవచ్చనీ అనే సమయానికి పరిస్థితి చేజారిపోతుంది. ఆమె చనిపోయిన రాత్రి, కలలో దేవదూతలతో అతను "ఈమె ధన్యురాలు, ప్రేమించినది" అనటం ద్వారా మార్పుని ఆహ్వానించినట్లుగా కనిపిస్తుంది.

Published @ Pustakam.net