5, జులై 2009, ఆదివారం

వీరప్పన్ లాగే ప్రభాకరన్ కూడా! (Interview - Final Part)

గత టపా నుంచి..

నేను: మరి ప్రభాకరన్ గురించి ఏం తెలుసు నీకు?
శ్రీనివాస దురై: ప్రభాకరన్ కూడా వీరప్పన్ లాంటోడేనబ్బా.. నమ్మినోడ్ని మోసం చేయలా.. మోసం చేసినోడ్ని విడిచిపెట్టలా..
నేను: అంటే..
శ్రీనివాస దురై: అంటే ఏముండాది? చిన్నప్పట్నుంచి మావోళ్ల(తమిళుల) మీద జరిగిన దాడులు చూస్తావుండాడు. ఏదో ఒకనాటికి లంకోళ్లకి బుద్ధి చెప్పాలనుకున్నాడు. తోడువచ్చినోళ్లతో కలిసి పోరాటం చేశాడు.
నేను: ప్రభాకరన్‌ని చాలా మంది తమిళులు నమ్మారు. ఆశ్రయమిచ్చారు. కాని, చివరికి వాళ్లకేం మిగిలింది?
శ్రీనివాస దురై: చూడబ్బా.. యుద్ధమంటే మాటలనుకుంటాండావా? అదేదో కిర్‌కెట్ మ్యాచు టీవీలో చూడటమనుకుంటన్నావా? యుద్ధమంటే ఒకటేనబ్బా.. చంపటం.. లేదా చావటం. అదీ చుట్టూ వాళ్లున్నప్పుడు మాట కోసం నిలబడాల. లొంగిపోయావా.. ఇక నువ్వు బతికినా చచ్చినట్లే. ఆ బతుకు కన్నా చావటమే మేలు.
నేను: అంటే..
శ్రీనివాస దురై: ఏందబ్బా.. అంటే అనేది ఊతపదమా ఏంది నీకు? ప్రతీది తెలియదంటాండావే?
నేను: అది కాదు.. అసలెందుకు చేశాండంత యుద్ధం ప్రభాకరన్?
శ్రీనివాస దురై: ప్రభాకరన్ చిన్నప్పుడే తుపాకీ పట్టాడు. తమిళోళ్లని ఏడిపించుకుతినేటోళ్లమీద యుద్ధం మొదలెట్టాడు. తనతొ నలుగురిని కలుపుకున్నాడు. సుమారు నలభై ఏళ్లు పోరాడాడు.
నేను: ఎవరికీ లేనిది ప్రభాకరన్‌కే ఎందుకు అంత కోపం?
శ్రీనివాస దురై: నీదేఊరబ్బా?
నేను: తెనాలి. అసలైతే అమరావతి పక్కన. నా చిన్నప్పుడు తెనాలి వచ్చాం.
శ్రీనివాస దురై: సరే, నీపక్కింటోడు వచ్చి నీదీ ఊరు కాదు కదా.. నీకు తాగటానికి నీళ్లియ్యం, తినటానికి గింజలివ్వమంటే ఏం చేస్తావు?
నేను: వాళ్లిచ్చేదేముంది?
శ్రీనివాస దురై: అదేనబ్బా.. నీకు ఏదీ అమ్మనీకుండా, వాళ్లు చెప్పినట్లుంటేనే బతకనిస్తాం అంటే?
నేను: నేనెందుకు ఒప్పుకోవాలి?
శ్రీనివాస దురై: ఏం.. ఎందుకొప్పుకోవు?
నేను: నన్ను వెళ్లిపొమ్మనటానికి వాళ్లకేమీ హక్కు లేదు కదా..
శ్రీనివాస దురై: నిన్నొక్కడ్ని అంటేనే నువ్వు ఊరుకోలేకపోతున్నావే.. లంకనుండి కొన్ని లక్షలమందిని వెళ్లిపోమన్నారబ్బా.. కొంత మంది తిరగబడ్డారు. చంపారు. ఇంకొంతమంది ముఠా కట్టి ఎదురు దాడులు చేశారు. పట్టుకుని కాల్చి చంపారు. అప్పుడే కుర్రాళ్లకి కోపమొచ్చింది. పధకం ప్రకారం దాడులు మొదలుపెట్టారు.
నేను: అసలెందుకిదంతా?
శ్రీనివాస దురై: లంకలో ఉన్న అరవోళ్లంతా.. ఒకప్పుడు ఇక్కడోళ్లే. కూలీకి తీసుకెళ్లారంటెప్పుడో. అక్కడ లంకోళ్లు పెట్టే బాధలు పడలేక అరవోళ్లు తిరుగుబాటు చెశారు. అప్పుడే ప్రభాకరన్ తుపాకీ పట్టుకున్నాడు.
(ఎల్‌టీటీఈ పుట్టుక, కారణాల గురించి, రాజీవ్‌గాంధీ హత్య కేసు దర్యాప్తు చేసిన శ్రీ. కార్తికేయన్ గారు, తన పుస్తకం - "నిప్పులాంటి నిజం"లో వ్రాసారు.
అందులోంచి సంగ్రహిస్తే..


1815లో లంకలోని టీ, కాఫీ ఎస్టేట్లలో పని చేసేందుకు కూలీల కోసం బ్రిటిష్ ప్రభుత్వం ఇక్కడ్నుంచి మనుషులని తరలించింది. కొన్ని వేలమంది అలా ఇక్కడ్నుంచి బలవంతంగా కాని, ఇష్టపడి కాని శ్రీలంక వెళ్లారు. అక్కడ వారికి ఎస్టేట్లలో కొంత భూమి ఉండటానికి ఇచ్చి కూలీ చేయించుకునేవాళ్లు. వందల సంవత్సరాలు అక్కడే ఉన్నా వాళ్లంతా ద్వితీయ శ్రేణి పౌరులుగానే మిగిలిపోయారు. అక్కడే పుట్టిన తర్వాతి తరం వాళ్లుకూడా వివక్షనెదుర్కొన్నారు. స్వాతంత్ర్యం వచ్చాక కూడా వాళ్ల పరిస్దితి మారలేదు. అప్పటికి శ్రీలంకలో ఉన్న తమిళులు పది లక్షలమందికి పైనే. తమిళులు ఎక్కువగా ఉన్న తూర్పు, ఉత్తర ప్రాంతాల్లో భూములు వ్యవసాయానికి ఎక్కువగా పనికొచ్చేవి కాకపోవటంతో.. వారు చదువుకి ప్రాధాన్యతనిచ్చారు. బ్రిటిషువారితో వచ్చిన మిషనరీలు ఇంగ్లీషు విద్యనందించాయి. పాలనా సౌలభ్యం కోసం బ్రిటిషువారు ఈ తమిళులని సింహళీయులు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో కూడా డాక్టర్లుగా, ఇంజనీర్లుగా ఇతర ఆఫీసర్లుగా నియమించారు. ఇది శ్రీలంకలొని ప్రధమ పౌరులుగా చెప్పుకుంటున్న వారికి కోపం తెప్పించింది. దీనితొ తమిళులలో సంఘీభావం పెరిగింది. 1947లో జరిగిన పార్లమెంటు ఎన్నికలలో వారు ఏడుగురు సభ్యులని పార్లమెంటుకి పంపారు. ఈ సంఘటనతో సింహళియులు మరింత జాగ్రత్త పడదామనుకున్నారు. మెజారిటీ సభ్యులు వాళ్లే కనుక 1948-పౌరసత్వ చట్టం, 1949-పార్లమెంటరీ ఎన్నికల చట్టం తీసుకువచ్చారు. ఫలితంగా టీ తోటల్లోని తమిళ కార్మికులంతా ఓటుహక్కు కోల్పోయారు. తమకంటూ ఒక్క రాష్ట్రం కూడా లేకుండా మిగిలిపోయారు. ప్రధానమంత్రి సేనా నాయకే తమిళ ప్రాంతాల్లో సింహళీయుల జనాభా పెరిగేందుకు, నీటి పధకాలతో కృషి చేశాడు. దీనితో తూర్పు ఉత్తర ప్రాంతాల్లో ఇరవై ఏళ్లలో సింహళీయుల జనాభా పదిరెట్లు పెరిగింది. ఇది అక్కడి జనాభా నిష్పత్తిని తీవ్రంగా ప్రభావితం చేసింది. దీనితో చరిత్ర పునరావృతమవుతుందేమో అని తమిళులు భయపడ్డారు. క్రీ. పూ. 101లో తమిళ రాజు ఎలారాను ఓడించిన సింహళరాజు దుత్తగామి కాలం మళ్లీ వస్తుందేమో అని వారు భావించారు [అంటే లంకలో తమిళులు ఎప్పుడో ఉన్నారన్న మాట].
1956లో సింహళం శ్రీలంక అధికారిక భాషగా, భౌద్ధమతం జాతీయమతవిధానంగా ఆమోదింపబడినవి. సింహళీయులకి, తమిళులకి మధ్య జరిగిన ఘర్షణలతో, తమిళులు కొలంబో వదిలేసి జాఫ్నా వెళ్లిపోయారు. 1961లొ మరో చట్టం అమలులోకి వచ్చింది. న్యాయస్ధానాలన్నింటిలో సింహళం మాత్రమే అధికార భాషగా మారింది. 1970లో వచ్చిన శ్రీలంక కొత్త రాజ్యాంగం శ్రీలంక గణతంత్ర రాజ్యంగా, సింహళం అధికార భాషగా, భౌద్ధం ప్రధాన మతంగా ప్రకటించింది. దీనితో సింహళీయుల ఆధిపత్యం ఒక్కసారిగా పెరిగింది. తమిళులు నేర్చుకున్న ఇంగ్లీషు కంటే సింహళానికే ప్రాధాన్యం పెరిగి తమిళ ఉద్యోగులు, విద్యార్ధులు దిక్కు తోచని స్థితిలో పడ్డారు. దీనితో తమ సమస్యల పరిష్కారం కోసం తమిళులు విభిన్న పంధాను ఎన్నుకున్నారు. అదే తీవ్రవాద పోరాటం. 1972లో తంగదురై, కుట్టిమణి ల సారధ్యంలో ఏర్పడిన సంస్ధ, తర్వాత 'తమిళ ఈలం లిబరేషన్ ఆర్గనైజేషన్ - "టీఈఎల్ఓ"గా మారింది. 1972లో "తమిళ న్యూ టైగర్స్"ని వేళుపిళ్లై ప్రభాకరన్ స్ధాపించాడు. అప్పటికి అతని పద్దెనిమిదేళ్లు. 1975 జులై 27న జాఫ్నా మేయరు- ఆల్ఫ్రెడ్ దురైయప్పను ప్రభాకరన్ కాల్చి చంపాడు. తమిళుల హీరో అయ్యాడు. 1976 మే 5న ప్రభాకరన్ తన "టిఎన్‌టి" ని లిబరేషన్ తైగర్స్ ఆఫ్ తమిళ ఈలం (ఎల్‌టీటీఈ)గా మార్చాడు. తమిళ స్వరాజ్యమే తన ఏకైక లక్ష్యంగా ప్రకటించాడు.)

నేను: సరే.. అదంతా తెలిసిన విషయమే కదా..
శ్రీనివాస దురై: అక్కడికే వస్తుండానబ్బా.. వీరప్పన్ లాగే ప్రభాకరన్ కూడా తన కోసం కన్నా తనను నమ్ముకున్న మనుషులకోసమే ఎక్కువ కష్ట పడ్డాడు. అలాగే.. తనకెదురొచ్చిన ఎవరినైనా అడ్డు తొలగించుకున్నాడు.
నేను: కానీ ప్రభాకరన్ ఒక లక్ష్యం కోసం పోరాడాడు కదా.. వీరప్పన్ అలా కాదు. అందరినీ బెదిరించి, దోపిడీ చేశాడు.
శ్రీనివాస దురై: అవునబ్బా.. వీరప్పన్ దోపిడీ చేశాడు. కాదనటంలే.. ఐతే ప్రభాకరన్ కూడా తన మనుషులకోసం దాడులు చేశాడు. ఆయుధాలు, డబ్బు దోచుకున్నాడు. అలాగే వీరప్పన్ కూడా తనని నమ్ముకున్న వాళ్లకి ఎంతో డబ్బు సాయం చేశాడు. ఎంతో మందికి పెళ్లిళ్లు చేశాడు. ఒకరకంగా చెప్పాలంటే వీరప్పన్ వల్ల తన చుట్టూ ఉన్న వాళ్లు బాగు పడ్డారు. ప్రభాకరన్ వల్ల అంతా నాశనం అయ్యారు.
నేను: ప్రభాకరన్ పోరాటయోధుడు, వీరప్పనేమో దోపిడీదారు. అసలు వీళ్లిద్దరినీ నువ్వెలా కలిశావ్? ఎప్పుడు కలిశావ్?
శ్రీనివాస దురై: వీరప్పన్ భార్య ముత్తులక్ష్మి అతన్ని ప్రేమించి పెళ్లి చేసుకుందబ్బా.. ముత్తు లక్ష్మి నాన్న నాకు దూరపు బంధువు. వాళ్ల ఊరికి అప్పుడప్పుడు వచ్చిపోతుండేవాడు. అలా కలిసేవాణ్ణి. 1985తర్వాత నేను శ్రీలంక వెళ్లాను, అక్కడ పనిచేయటానికి. మాంకులం (ముల్లైతీవు నుండి 100కి.మీ. ఉంటుందేమో, నాకు గూగుల్ మ్యాప్‌లో కనిపించింది తర్వాత వెదికితే) దగ్గర ఒక పల్లెటూళ్లో నూనె ఫ్యాక్టరీలో ఐదేళ్లు పైనే పని చేశాను. ప్రభాకరన్ రాజ్యమే అదంతా. అతనేది చెబ్తే అదే జరుగుతుంది అక్కడ. రాజీవ్ గాంధీని వాళ్లు చంపేశాక అక్కడి పరిస్ధితులు బాగోలేదు. ఇండియా నుంచి వచ్చిన వాళ్లు చాలా మందే ఉన్నారప్పుడక్కడ. టైగర్ల గురించి చెప్పమని మిలిటరీ వాళ్లు వేధించేవాళ్లు. ఇక ఉండలేక ఆరుగురం వచ్చేశాం అక్కడినుండి. అది ప్రభాకరన్ ప్రాంతమవటంతో అప్పుడప్పుడు జనాల్లోకి వచ్చేవాడు. తమిళ రాజ్యం రావాలంటే త్యాగాలు తప్పవనేవాడు. ఒక్కో ఇంటి నుంచి ఒక్కళ్లని తనతో పంపమని అడిగేవాడు. ఇండియా నుండి వచ్చిన సైనికులంటే మాత్రం అసహ్యించుకునేవాడు. వాళ్ల వల్ల అమాయకులు బలవుతున్నారని అనేవాడు. పని చేసుకోటానికి వచ్చిన వాళ్లని మాత్రం ఇబ్బంది పెట్టద్దనేవాడు. వాళ్లు ఇక్కడ బాగుంటేనే ఇండియాలో సహాయం చేస్తారని చెప్పేవాడు. కనీసం పది సార్లు చూశాను నేను ప్రభాకరన్‌ని.
నేను: అసలు అంత ఈజీగా ప్రభాకరన్ దగ్గరకు వెళ్లే అవకాశం ఉంటే ఎప్పుడో చంపే వాళ్లు కదా?
శ్రీనివాస దురై: అదేమీ అంత ఈజీ కాదు. మేము పని కోసమే వెళ్లినా మా భాధ్యతంతా మా ఓనర్‌ల మీద ఉండేది. పూర్తిగా నమ్మకమైన వాళ్లనీ, అది కూడా అరవోళ్లని మాత్రం తెచ్చుకోమనే వాడు. పనోళ్లు తప్పు చేస్తే ఓనర్‌లను చంపేసేవాడు. అందుకే అంత త్వరగా ఎవరిని దగ్గరకి రానిచ్చేవారు కాదు.
నేను: మరి నువ్వెలా వెళ్లావ్?
శ్రీనివాస దురై: అదే చెబుతుండా.. మా ఓనరు పేరుకే ఓనరు. ఆ మిల్లు ప్రభాకరను డబ్బులతో నడుస్తుండాదనేవారు. వాళ్లు అక్కడికి వస్తే మా మిల్లులోనే మీటింగు పెట్టేవాళ్లు. ఒకసారి నీళ్లు కావాలంటే మా ఓనరు నన్ను పంపాడు సీసా ఇచ్చి. అతని పక్కనున్నోళ్లు నన్ను తాగమన్నారు ముందు. అంత జాగ్రత్త. ఇక్కడేపని చేస్తావని అడిగాడు నన్ను. తమిళనాడులో ఎక్కడ నీఊరని అడిగాడు. తమిళ రాజ్యం వస్తే ఇక్కడికొచ్చేస్తారా అని అడిగాడు.
నేను: ఏమని చెప్పావ్ మరి?
శ్రీనివాస దురై: రానని చెప్పా. అది నేను పుట్టిన ఊరని చెప్పా. నవ్వాడు. మరి ఇప్పుడెందుకొచ్చావ్? అని అడిగాడు. బతకటానికని చెప్పా. అంతా ఇక్కడ చంపుతున్నారని అనుకుంటుంటే నువ్వు బతకటానికొచ్చావా? అని అడిగాడు. బతికే ఉన్నాను కదా ఇప్పుడని నవ్వా నేను కూడా. తర్వాత మా ఓనరు తిట్టాడు నన్ను అలా మాట్లాడానని.
నేను: మిగతా వాళ్లకి తెలియని విషయాలేంటి మరి?
శ్రీనివాస దురై: ప్రభాకరన్ ఏదుంటే అది తినేస్తాడు. ఉన్నప్పుడు బాగా తింటాడు. పాటలు పాడతాడు. రేడియో వింటాడు. పెళ్లాం పిల్లలంటే ప్రేమ ఉండేది బాగా. తన జీవితం గురించి తెలిసి కూడా తనని పెళ్లి చేసుకుందని పెళ్లాన్ని బాగా చూసుకునేవాడు. తను చనిపోయినా పెళ్లాం పిల్లలు బాగుండాలని కోరేవాడు.
నేను: ప్రభాకరన్ మంచోడా? లేక వీరప్పన్ మంచోడా?
శ్రీనివాస దురై: ఇద్దరూ ఇద్దరేనబ్బా.. అనుకున్న దానికోసం ప్రాణాలిస్తామన్నారు. అలాగే పోయారు. ఈలోకంలో ఎవడూ మంచోడు కాడబ్బా.. అందరికీ మంచిగా కనిపించటం కూడా కుదరదు. నేను: ఇద్దరిలో ఏం పోలికలు చూశారు మీరు?
శ్రీనివాస దురై: ప్రభాకరన్, వీరప్పన్ ఇద్దరూ తమ చుట్టూ ఉన్న వాళ్ల కోసమే కదా ఏంచేసినా.

ఇద్దరూ మంచి గురిగాళ్లు. శతృవుని చంపేటప్పుడు కౄరంగా చంపేవోళ్లు. అలా ఐనా తమకోసం వచ్చేవాళ్లు భయపడి వెనక్కి తగ్గుతారని వీరప్పన్ అనేవాడు. వాడు రావటం ఎందుకు? నా చేతిలో చావటం ఎందుకని అనేవాడు. ఇద్దరూ డబ్బుని పక్కన వాళ్లకోసమే ఖర్చు చేశారు. ప్రభాకరన్ వ్యాపారాలు చేశాడంటారు, మరదేమయిందో కానీ, వీరప్పన్ మాత్రం ఏమీ మిగుల్చుకోలేదనుకుంటా. ఇద్దరూ పెళ్లాల్మ్ పిల్లలకు దూరంగా ఎక్కువ కాలం గడిపారు కదా.. కానీ ఇద్దరి పెళ్లాలూ, వాళ్ల గురించి తెలిసే ఇష్టపడి చేసుకున్నారు. ఇద్దరూ కూడా ఎన్‌కౌంటర్లోనే చనిపోయారు కదా..
నేను: చాలా టైం తీసుకున్నాను పెద్దాయనా.. వాళ్లిద్దరికీ డూపులున్నారని అనేవాళ్లు కదా.. ఎంతవరకూ నిజం?
శ్రీనివాస దురై: ఏరబ్బా.. డూపులు? వాళ్లు చచ్చి ఇన్నాళ్లయింది కదా.. మీవాళ్లు ఊరికే వదులుతారా? ఈపాటికి ఒక్కడ్నైనా లాగి జనానికి చూపందే ఊరుకుంటారా?
నేను: సరే.. మరి వీళ్ల ఎన్‌కౌంటర్లు నిజమేనంటావా?
శ్రీనివాస దురై: ఒక్కటబ్బా.. వాళ్లైనా, పోలీసులైనా మనుషులే కదా.. వాళ్లకి దొరికినోళ్లని హింసించి చంపారు కదా.. పోలీసులు మాత్రం ఊరుకుంటారా? నేనైనా అంతే చేస్తానబ్బా.. ఐనా అది జరిగినప్పుడు నువ్వూ నేను దగ్గర లేము కదా.. మనకెందుకు ఆ గొడవ?



ఇక్కడ ఒక విషయం నేను చెప్పాలి. శ్రీనివాస దురై ఎంత వరకు నిజాలు చెప్పారన్నది నేను విశ్లేషించలేను. కనుక ఈ విషయాలన్నీ నిజమేనని నేను ఎవరికీ ఎంత మాత్రం హామీ ఇవ్వటం లేదు. కొన్నింటికి నాకు తెలిసిన అదనపు విషయాలను మాత్రం జోడించాను. అనుకోకుండా కలిసిన వ్యక్తితో ఒక చిన్న టీ హోటల్‌లో జరిగిన ఈ సంభాషణకు నా దగ్గర ఎటువంటి రికార్డులు కూడా లేవు, పేర్లు, సంవత్సరాలూ వ్రాసుకున్న చిన్న కాగితం తప్ప.