14, సెప్టెంబర్ 2011, బుధవారం

విధాత వరప్రభావం

విధాత మనుషుల తలరాతలను రాస్తున్న సమయంలో "నాధా, ఓసారి ఇలా రారూ.." అని మాత పిలిచింది. సరే, పాపం ఆమెకేం ఇబ్బంది వచ్చిందోనని ఆయన అలా.. వెళ్లారు. ఎన్నో ఏళ్ల తర్వాత దొరికిన అవకాశం అనుకుని ప్రొడక్షన్ టీమ్‌లోని వాళ్లు చిన్న కునుకేశారు. అంతే.. విధాత తిరిగొచ్చేలోగా ఓ పొరపాటు జరిగిపోయింది. మాన్యుఫాక్చరింగ్ డిపార్ట్‌మెంట్, క్వాలిటీ కంట్రోల్ వాళ్లకు డెలివరీ చేసిన లాట్‌లోంచి ఓ మనిషి తప్పించుకున్నాడు. దాన్ని కవర్ చేసుకునేందుకు పక్క బ్యాచ్‌లోంచి ఒకడిని సర్దుతూ పోయారు. దీంతో.. ఒకడి తలరాతలు మరొకడి నుదిటిమీద రాసేశాడు విధాత.
---------------------
అప్పుడు QCలో తప్పించుకున్న వాడు డిస్పాచ్ సెక్షన్‌లోకి చొరబడి మిగతావాళ్లతో పాటు లైన్‌లో నుంచున్నాడు. నుదుటి మీద గీతలు లేకపోతే తనను మిగతావాళ్లు గుర్తుపట్టేస్తారేమో అనే భయంతో ఉన్న అతడిని కాపలావాళ్లు చూడనే చూశారు. పక్కకు లాగాలాని ట్రై చేస్తే ఇంచు కూడా కదలడు. చివరకు ఓ భటుడికి కోపం వచ్చి ముక్కు మీద గుద్దాడు. అంతే.. లేత ముక్కు కదా ఊడిపోయింది.
--------------------
చివరకు ఎలాగైతేనేం.. అతడిని తీసుకెళ్లి తలరాత క్యూలో నుంచోబెట్టారు. ముక్కు ఊడిపోయి మాన్యుఫాక్చరింగ్ డిఫెక్ట్ ఉన్న అతడిని భూమి మీదకు పంపవద్దన్నాడు విదాత. మా తప్పేమీ లేదు, డిస్పాచ్ వాళ్లు సరిగా హ్యాండిల్ చేయలేదు కాబట్టే ముక్కు ఊడిపోయింది అన్నారు మాన్యుఫాక్చరింగ్ డిపార్ట్‌మెంట్ వాళ్లు. క్వాలిటీ కంట్రోల్ వాళ్లు చేసిన పొరపాటే అతడి తప్పించుకోవటానికి కారణం అన్నారు డిస్పాచ్ వాళ్లు. తలరాతకు ముందే తప్పించుకునే తెలివినిచ్చిన మాన్యుఫాక్చరింగ్ వాళ్లదే తప్పంతా అని వాదించారు QCవాళ్లు. దీంతో ఎక్కడ పని అక్కడ ఆగిపోయింది. ఈలోపు మరి కొంత మంది అతనికి శిష్యులుగా చేరి ఆ తెలివితేటలు కొంచెం నేర్చుకున్నారు.
-------------------
జనాభాలో వేదభూమి ఇండియా, చైనాని బీట్ చేయలేదేమో అనుకున్న విధాత చివరకు దిగివచ్చాడు. పుట్టకముందే తగవులు పెట్టగలిగిన అతడిని ఎలాగైనా వదిలించుకుందామనుకున్నాడు. మాన్యుఫాక్చరింగ్ డిపార్ట్‌మెంట్ వాళ్లతో మాట్లాడి అతని ముక్కుకి అందరూ గుర్తుపట్టేలా అతుకేయించాడు. తలరాత రాసేటప్పుడు.. "అందరికీ తలలో నాలుకలా ఉండు" అంటూనే నాలుకకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడే గుణాన్ని ఇచ్చాడు.
-------------------
తలరాత పూర్తవుతున్న సమయంలో అతనికి ఓ డౌట్ వచ్చింది. "జనాభా పెరిగితే భూమి కూడా పెరుగుతుందా?" అని విధాతని అడిగాడు. "భూమి ఎలా పెరుగుతుంది నాయనా?" అని అమాయకంగా ఆడిగాడు మ్యాన్‌మేకర్. "మరి జనం పెరిగితే భూమ్మీద ఇబ్బంది కదా?" అన్నాడు మనోడు. "అది చూసుకోవడానికి యమధర్మరాజున్నాడు నాయనా" అన్నాడు విధాత. "నీకప్పుడే ఇన్ని తెలివితేటలు వచ్చాయి, నన్నే ప్రశ్నించే రేంజికి ఎదిగావు కాబట్టి భూమి మీద నువ్వేం చేద్దామనుకుంటున్నావో చెప్పు.. అదే చేసేలా వరం ఇస్తాను.." అన్నాడు మేకర్. "సరే.. నువ్వంతగా అంటున్నావు కాబట్టి ఆ యమధర్మరాజు పోస్ట్ నాకే ఇవ్వు.." అన్నాడు. "అది కష్టం నాయనా! దేవేంద్రుడు ఊరుకోడు తర్వాత తన సీటడుగుతావని... కాకపోతే వరం ఇస్తానని నేనే అన్నాను కాబట్టి, యముడి అంశ కొంచెం నీకు ఇస్తాను. దాని ప్రభావంవల్ల, నాలుకనే ఆయుధంగా చేసుకుని కొంతమంది ప్రాణాలు అయినా తీసి సరదా తీర్చుకో" అన్నాడు విధాత.
--------------------
చివరకు అతను భూమ్మీద పడ్డాడు.. మేకింగ్ సమయంలో అతని దగ్గర తెలివితేటలు నేర్చుకున్నవారు ఇక్కడా అతని చుట్టూ చేరారు. ప్రస్తుతం విధాత ఇచ్చిన వరం ఉపయోగిస్తున్నారు.

5, ఫిబ్రవరి 2011, శనివారం

జైబోలో తెలంగాణ.. హిట్! (సినిమా రివ్యూ మాత్రం కాదు)

ఆగండి.. ఆగండి.. నేనింకా ’జై బోలో తెలంగాణ’ సినిమా చూడనే లేదు. ఇక రివ్యూ ఎలా రాయగలను చెప్పండి? ఐనా ఇప్పటికే పదుల సంఖ్యలో మన బ్లాగర్లు ఆ సినిమా గురించి రాసేశాక నేను రాసేదేముంది?

నా సోది ఏమిటంటే..

తెలంగాణ ఉద్యమంపై ఓ సినిమా తీస్తానని దర్శకుడు శంకర్ ప్రకటించిన రోజు నుంచీ.. రాష్ట్ర ప్రజల్లో ఓ విధమైన ఆసక్తి నెలకొంది. ఇక ’జైబోలో తెలంగాణ’ సినిమా మొదలైనప్పటినుంచి.. అందరిలో ఉత్కంఠ కూడా పెరిగిపోయింది. నటులకు కుల, మత, ప్రాంతీయ భేదాల్లేవంటూ జగపతి బాబుని ఒప్పించటంలో శంకర్ సక్సెసయ్యారు. ఒక ఆంధ్రా వాడు తెలంగాణ సినిమాలో హీరోనా అని అడిగిన ప్రజలకు, ప్రజా సంస్ధలకు ఆయన ఏదో సమాధానం చెప్పి ఒప్పించారు. ఆ తర్వాత సినిమాలోని మిగిలిన తారాగణంగా.. మా గురువు గారు మల్లేపల్లి లక్ష్మయ్య, తెలంగాణ తల్లి ముద్దు బిడ్డ దేశపతి శ్రీనివాస్, నీటిపారుదల రంగ నిపుణుడు విద్యాసాగర్ గారు, సీనియర్ జర్నలిస్టు అల్లం నారాయణ.. ఇలాంటి ప్రముఖులను నటింప జేశారు. పల్లె పదాలతో అద్భుత సాహిత్య సృష్టి చేయగల గోరటి వెంకన్న, ప్రతి మాటలో నిప్పు పుట్టించగల గద్దర్, ఎవరితో ఎలా మాట్లాడితే ఉద్యమ సెగ రగులుతూనే ఉంటుందో తెలిసిన కేసీఆర్.. ఇలాంటి మహామహులతో సినిమా పాటలకు అక్షర మెరుగులద్దించిన శంకర్ రిలీజ్ చేయటానికి ముందే సినిమాను విజయవంతం చేసుకున్నారు. సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పగానే.. వెల్లువలా ఎగసిన నిరసనలు ఈ సినిమాపై ప్రజల ఆసక్తిని అందరికీ చూపించాయి. ముందు అనుమతి ఇవ్వబోమని మొండికేసిన సెన్సార్ బోర్డు.. చివరకు ’ఎ’ సర్టిఫికెట్‍తో ప్రదర్శనకు పర్మిషన్ ఇచ్చింది.

సినిమా రిలీజ్‌ చేసుకుంటారు సరే.. తెలంగాణలో తప్ప ఎవరు చూస్తారనుకున్న నాలాంటి వారికి అనూహ్యమైన సంఘటనలు కనిపించాయి. నాలుగు రోజులు పని ఉండి గుంటూరు జిల్లా తెనాలి వెళ్లిన నాకు, అక్కడ ఓ ధియేటర్‌లో ’జైబోలో తెలంగాణ’ ప్రదర్శనకు ఏర్పాట్లు జరుగుతుండటం ఆశ్చర్యమనిపించింది.


ఒకప్పుడు తెలంగాణ మాటెత్తితే ఊరుకోని చోట ఈ సినిమాను అంత ధైర్యంగా ఎలా ప్రదర్శించబోతున్నారో తెలుసుకుందామనిపించింది. ఇదే మాట ఆ సినిమా హాలు ఉద్యోగిని అడిగితే.. "డబ్బెవరికి చేదు?" అని ప్రశ్నించారు. అన్ని ముఖ్యమైన జె‌ఎసిల నుంచి హామీలు తీసుకున్నారని ఆ తర్వాత తెలిసింది. సినిమాలో అభ్యంతరకరమైనవి లేకపోతే తాము అడ్డంకి కాబోమని జె‌ఎసిలు హామీ ఇచ్చాయిట. పోనీలే.. ప్రొడ్యూసర్‌కి నష్టం కలిగించటం లేదు.. అని నేను కూడా ఊరుకున్నా. ఫిబ్రవరి మూడున గుంటూరు నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో కొందరు జర్నలిస్టు మిత్రులు, విద్యార్ధి నాయకులు నాగార్జున యూనివర్సిటీ జె‌ఎసి ఇచ్చిన హెచ్చరిక గురించి మాట్లాడారు. ఏమిటా హెచ్చరిక? "సీమాంధ్రులను కించపరిచే ఏ ఒక్క డైలాగైనా జగపతి నోటి వెంట వస్తే.. అతనికి పరపతి లేకుండా చేసి, తిరుపతిలో గుండు కొట్టిస్తాం" అని. "సరే, ఎవరో కవిహృదయం బాగా ఉన్న వ్యక్తి స్టేట్‌మెంట్ తయారు చేశాడు, నిజంగా జగపతి బాబు మీతో తిరుపతి వస్తాడా?" అని నా ప్రశ్న. నువ్వెక్కడి జర్నలిస్టువిరా అన్నట్లు చూశారు అక్కడున్న వాళ్లు నన్ను. "జె‌ఎసిలు చెప్పినవన్నీ చేయవు.. జనంలో మనం పలుచన కాకూడదనే ఎక్కడి జె‌ఎసి స్టేట్‌మెంట్ ఇచ్చినా..  ఆమాత్రం తెలీదా?" రివర్స్ క్వశ్చన్!
ఆ చర్చలో అనుకున్న విషయం.. "తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు, అక్కడి పరిస్థితులపై మన వాళ్లకు ఇంకొంచెం ఎక్కువ అవగాహన రావాలన్నా.. ఈ సినిమా ఇక్కడ కూడా ఆడాలి. ఎటువంటి అడ్డంకి ఉండకూడదు. ఇలా చేయటం వల్ల అక్కడి ప్రజల్లో మన సినిమాల పట్ల కూడా కొద్దిగా సానుకూలత వస్తుంది. ఎవడో ఏదో అన్నాడని ప్రతి సారీ సినిమా రిలీజ్‌లను అడ్డుకునే వారు తగ్గుతారు. వాళ్లకు ఇవ్వాల్సిన మామూళ్లు తగ్గుతాయి. ఏమో.. అదే జగపతి బాబుని పెట్టి ఇంకెవరో డైరెక్టర్ ’జై సమైక్యాంధ్ర’ అనే సినిమా తీయావచ్చు.. ఈ సినిమాలో ఆంధ్ర వారి గురించి చేసిన కామెంట్లకు బదులు చెప్పావచ్చు.. ఎవరు చూశారు?" నాకైతే ఇది బోడిగుండుకీ, మోకాలికీ ముడి పెడుతున్నట్లనిపించింది.

కానీ.. ఇప్పుడు నాకనిపిస్తోందిది..
"తెలంగాణ విముక్తి పోరాటంలో ఆంధ్ర మహా సభలు, వాటిని నడిపిన ఆంధ్ర కమ్యూనిస్టు యోధుల గురించి ప్రజలు మరిచిపోయారు. నిజాం సేనలకు వ్యతిరేకంగా దొరల గడీలపై తిరగబడిన బందగీ గుర్తున్నాడు కానీ.. ఆ బందగీతో కలిసి వ్యూహరచన చేసిన వారెవరో మనకు తెలియదు. దొర కన్ను పడిన ప్రతి స్త్రీ చీకటి పడేవేళకు గడీకి వెళ్లాలన్న నిజాలను, ఈ  అకృత్యాలను, అత్యాచారాలను చూసి చూసి కడుపు మండి.. "నా పెళ్లాం నీ గడీకి రాదు దొరా!" అని గళమెత్తిన వారిని గుర్తు చేయాలని ఉంది. అప్పటి ప్రజలది నిజాం పాలన నుంచి విముక్తి పోరాటమే కానీ, ఆంధ్రుల వ్యతిరేక ఉద్యమం కాదని చెప్పాలని ఉంది. రైతాంగ పోరాటం సమయంలో ఊళ్ల నుంచి పారిపోయి.. హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్రాల్లో ఆశ్రయం పొంది.. ఇండియన్ యూనియన్ సైన్యాలతో పాటే గ్రామంలోకి తిరిగొచ్చిన దొరలను, వారికి మేకతోలు కప్పి తీసుకువచ్చిన అప్పటి కాంగ్రెసు పెద్దలను ప్రశ్నించాలని ఉంది. పెద్దమనుషుల ఒప్పందం, ముల్కీ నిబంధనల ద్వారా లభించాల్సిన సమాన న్యాయానికి పాతరేసిన నాయకులను ప్రశ్నించాలని ఉంది. వలసపోతున్న ప్రజానీకం, ముంబయి, గల్ఫ్ ఎడారుల్లో దీనుల గాధలను వివరించాలని ఉంది. ప్రపంచం కుగ్రామమవుతున్న ఈ సమయంలో.. లక్షల కొద్దీ ఉద్యోగాలను హాం.. ఫట్ అంటూ సృష్టిస్తామంటున్న నాయకులను, వారిని నమ్మి మోసపోతున్న అమాయక విద్యార్థులను పరామర్శించాలని ఉంది. పరీక్షలు రాసి తల్లిదండ్రుల ఆశలు, ఉన్నత చదువులు, ఉద్యోగాలంటూ తిరిగే యువతరం ఒకవైపు.. అమ్మనాన్నల తరం సాధించలేకపోయిన దాన్ని చేసి చూపుతాం అంటూ ప్రాణాలను పణంగా పెడుతున్న ఉడుకు రక్తం మరోవైపు.. తెలుగువాడి జీవితపు నాణెంలోని రెండుముఖాలను చూపాలని ఉంది. కవులు, కళాకారులకు ప్రాంతం, మతం భేదాలు లేవంటున్న నాయకులు, రచయితలు... మా ప్రాంతం వారికి తగిన గుర్తింపు రావట్లేదు.. అని చేసే వాదనలకు సమాధానం చెప్పాలని ఉంది. టాలెంట్ ఉన్న వారికీ, లాబీయింగ్ వచ్చిన వారికీ మాత్రమే అవార్డులు, రివార్డులు వస్తాయన్న మినిమం నాలెడ్జ్ లేదా అని ప్రశ్నించాలని ఉంది. మా నాయకులను మేమే నడిపిస్తాం అంటున్న కొందరు యువకులను చూసి నవ్వు వస్తోంది. అవసరం తీరే వరకే ఏ నాయకుడైనా మన మాట వింటాడు కానీ.. ఆ తర్వాత ఎందుకు పట్టించుకుంటాడు? నాయకులను ఎదిరించి ప్రాణాలు కోల్పోయిన వారు వేలల్లో ఉండే ప్రస్తుత సమాజంలో.. యువకుల మాట వినే నాయకుడిని ఒక్కడిని చూపించండంటూ అడగాలని ఉంది." ఓహ్.. చాలా అయిపోయింది.

ఇదీ సంగతి.. ఎప్పుడూ నా పనేదో చూసుకునే నన్ను కూడా ఇంత సీరియస్ పోస్ట్ రాసేలా చేసింది జైబోలో తెలంగాణ చిత్రం.
ఆ చిత్రం ద్వారా ప్రతి ఒక్కరిలో కదలిక తీసుకురావాలనుకున్నదే శంకర్ మనోగతమైతే.. నిజంగా.. "జైబోలో తెలంగాణ" హిట్ అయినట్లే.

2, ఫిబ్రవరి 2011, బుధవారం

ఏం జరుగుతోంది?

ఏదో జరుగుతోంది..
నా చుట్టూ దృశ్యాలు..
లీలగా కనుమరుగవుతున్నాయ్..
ఎవరివో మాటలు
అస్పష్టంగా మారి గాలిలో కలిసిపోతున్నాయ్

ఏదో జరుగుతుంది..
కళ్లను ఎంత బలంగా
తెరుద్దామని ప్రయత్నించినా..
గాట్టిగా మూసుకుపోతున్నాయ్
బుజ్జి పొట్టతో ఉండే నా భారీ శరీరం..
దూది మూటలా తేలిపోతోంది..

ఏదో జరుగుతోంది..
చుట్టూ చీకట్లు కళ్లను కప్పేస్తోంటే..
అదేదో లోకంలోకి అలవోకగా వచ్చి పడ్డాను..
వెలుగుకి అలవాటుపడని నా కళ్లు
తెరుచుకోటానికి ఇబ్బంది పడుతున్నాయ్
బలవంతంగా తెరచి చూస్తే..
అదేదో భారీ బహిరంగ సభ!!

వేదిక మీద లక్షల మంది జనం!
ఎదురుగా.. వందల సంఖ్యలో
ఖద్దరు చొక్కాలు, చీరల వాళ్లు!!
వారి వెనక పదుల సంఖ్యలో తెలుగు బ్లాగర్లు!!!
అర్ధంతరంగా ఊడిపడిన నాకు..
వారికీ, వీరికీ మధ్య ప్రెస్ గ్యాలరీలోనే చోటు దొరికింది.

రచ్చబండ కార్యక్రమం జరుగుతోందక్కడ.

"నువ్వు మోసం చేశావంటే.. నువ్వు మోసం చేశావ్"అంటూ
కింద ఉన్న వాళ్లు కొట్టుకుంటున్నారు.
"నీమీద విచారణ జరపాలంటే.. నీమీదే జరపా"లని డిమాండ్ చేస్తున్నారు.
"నీది మోసం అంటే.. నువ్వు మోసం చేయలేదా" అని
కొందరు తెలుగు బ్లాగర్లు ఎదురు ప్రశ్నించుకుంటున్నారు.

వాళ్లకి కొద్దిగా పైనున్న నేను కళ్లప్పగించి చూస్తున్నాను.

నా కంటే పైనున్న జనం మాత్రం..
ఈలలు వేస్తూ..
కుళ్లిన కోడిగుడ్లు, టొమేటాలు
విసురుతున్నారు.

మధ్యలో ఉన్నాను కదా..
నాకు కూడా సన్మాన కార్యక్రమం బాగానే జరిగింది.
ఆ దెబ్బలతోటే.. మెలకువ వచ్చింది.

30, జనవరి 2011, ఆదివారం

ట్రై వ్యాలీ యూనివర్సిటీలో తెలుగోళ్ల బాధలు

భారత ప్రభుత్వ ఒత్తిడికి అమెరికా తలొగ్గింది. కాలిఫోర్నియాలోని ట్రై వ్యాలీ యూనివర్సిటీ వల్ల మోసపోయిన భారత విద్యార్థుల కోసం అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. ఫారెన్ ఎఫైర్స్ మినిస్ట్రీని సంప్రందించడానికి ఇ మెయిల్ అడ్రస్, వాయిస్ మెయిల్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. సహాయం కావలసిన విద్యార్థులు 415 - 844-5320 అనే నెంబర్‌కు ఫోన్ లేదా వాయిస్ మెయిల్ చేయవచ్చు.SFRHSIFraud@dhs.gov అనే ఈ మెయిల్‌ ఐడికి తమ కంప్లెయింట్లను పంపించవచ్చు

శాంతి దూత.. మహాత్మ గాంధీ

29, జనవరి 2011, శనివారం

చదువే నేరమౌనా? (అమెరికాలో తెలుగు వారి దుస్థితి)

అది 2009 సంక్రాంతి సమయం.. ఇండియా నుంచి వెళ్లిన తెలుగు విద్యార్థులు ట్రైవ్యాలీ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నారు. నాలుగు లక్షల రూపాయల ఫీజు, రెండు సూట్ కేసులు, కష్టపడి చదవాలనే ఒక్క కలతో అమెరికాలో అడుగుపెట్టారు. శాన్ ఫ్రాన్సిస్కో, శాన్ జోస్, సిలికాన్ వాలీకి అతి దగ్గర్లో ఈ యూనివర్సిటీ ఉండటంతో.. తెలుగువారి పరిచయాలు, వాతావరణం కనిపించాయి. హోమ్ సిక్‌ను పోగొట్టుకునేందుకు అక్కడి ట్రైవ్యాలీ తెలుగు సంఘం వారితో కలిసిపోయారు. పండగ గెస్టులుగా వచ్చిన సినీతారలు మంచు మనోజ్, లక్ష్మి ప్రసన్నలతో  ఆడారు.. పాడారు..

సరిగ్గా రెండేళ్ల తర్వాత.. 2011.. అదే సంక్రాంతి సమయం.. మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి, అప్పులు చేసి ఫీజులు కట్టిన ఆ విద్యార్థులు రాబోయే ట్రైమిస్టర్ కోసం ప్రిపరేషన్‌లో ఉన్నారు. ఇంతలో ఉరుము లేని పిడుగులా.. ఇమిగ్రేషన్స్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు యూనివర్సిటీలో అడుగుపెట్టారు. విద్య పేరుతో వీసాలిచ్చి మనుషుల అక్రమ రవాణాకు సహకరించారని యూనివర్సిటీ ప్రెసిడెంట్ సుసాన్ సూ మీద కేసు రిజిస్టర్ చేశారు. వీసా ఇప్పించినందుకు అధిక మొత్తంలో డబ్బు వసూలు చేశారని ఆరోపించారు. కోర్సులకు అక్రిడెటేషన్ లేకుండా విద్యాసంస్థ నడుపుతూ మోసం చేస్తున్నారని చెప్పారు. అక్కడి ఫెడరల్ కోర్టు ఆదేశాల ప్రకారం యూనివర్సిటీని మూసివేశారు. సుమారు 1600మంది విద్యార్థుల జీవితాలను ఒక్క లెటర్‌తో రోడ్డున పడేశారు.

అసలీ విద్యార్థులు ఎందుకు మోసపోయారు? లక్షల కొద్దీ  ఫీజులు గుంజుతున్న యూనివర్సిటీకి కళ్లుమూసుకుని డబ్బెలా చెల్లించారు? అమాయకంగా అమెరికాలో అడుగుపెట్టిన వీరిని.. అక్కడి పోలీసులు ఎందుకు అరెస్టు చేస్తున్నారు? అసలేం జరిగింది?

దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో పాటు మన రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్, విజయవాడ, వైజాగ్, తిరుపతి లాంటి సిటీల్లో ప్రతి సంవత్సరం కొన్ని సంతలు జరుగుతాయి. వివిధ దేశాల్లోని యూనివర్సిటీల ప్రతినిథులు ఏసీ గదుల్లో కూచుని విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇస్తుంటారు. తమ యూనివర్సిటీకి ఉన్న పేరు, కోర్సులు, అవకాశాలు వంటి వాటిపై సుదీర్ఘమైన లెక్చర్లిస్తారు. ఆ యూనివర్సిటీలో చదవకపోతే..  అక్కడున్న వారి జీవితం వ్యర్ధమైనట్లే అని భావించేలా చేస్తారు. ఆ మైండ్ సెట్‌తో ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు తల్లిదండ్రులను వేధించో.. బతిమాలో.. ఫారెన్ చదువులకు ఒప్పిస్తారు. ఉన్నవన్నీ తాకట్టు పెట్టించి, అప్పులు చేయించి.. లక్షల కొద్దీ డబ్బును ఆ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్ కన్సల్టెన్సీల చేతుల్లో పోస్తారు. అలా.. ప్రతి ఏడాది.. రెండు మూడు సార్లు జరిగే సంతల్లోకి.. 2008లో ఓ యూనివర్సిటీ ప్రతినిథులు వచ్చారు. అది.. ట్రైవ్యాలీ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ వెబ్‌సైట్ ప్రకారం..  హైదరాబాద్‌లోని రెండు కన్సల్టెన్సీలు వారికి రిప్రజెంటేటివ్స్‌గా వ్యవహరిస్తున్నాయి.

అందరిలాగే.. భవిష్యత్తు గురించి కలలు కన్న కొందరు స్టూడెంట్స్.. ఆశల సౌధాలను నిర్మించుకున్నారు. అమ్మానాన్నల వెంటబడి.. డబ్బుని చెల్లించారు. ఈ ప్రాసెస్‌లో అసలా యూనివర్సిటీకి అమెరికా ప్రభుత్వ గుర్తింపు ఉందోలేదో చెక్ చేయటం మర్చిపోయారు. ఒకవేళ ఆ కన్సల్టెన్సీ వారిని అడిగినా.. అక్రెడిటేషన్ వస్తుందని చెప్పి నమ్మించి ఉంటారు. అలా.. ఈ రెండేళ్లలో.. ఇండియాకు చెందిన 1400మందికి పైగా విద్యార్థులు అమెరికాలోని ప్లీసన్‌టన్ చేరుకున్నారు. అరగంట ప్రయాణంలో సిలికాన్ వేలీ ఉండటం.. అక్కడ తెలుగు వారు ఎక్కువగా నివసించడం, ఇండియాలోని తెలుగు విద్యార్థులను ఎక్కువగా ఈ యూనివర్సిటీ వైపు చూసేలా ప్రోత్సహించింది. యూనివర్సిటీలోని నాలుగు డిపార్ట్‌మెంట్లలోని ప్రొఫెసర్లలో ఎక్కువమంది తెలుగువారు కావటం.. ఇంగ్లీషు ఎక్కువగా రాని వారిని ఆకర్షించింది .  తెల్ల వాళ్ళ లాండ్‌పై.. తెలుగోళ్ల మధ్య బతికేయవచ్చనే ఆశ.. బంధువులో, మిత్రులో అక్కడున్నారనే ధైర్యమో.. ట్రైవ్యాలీ యూనివర్సిటీలోని ఇండియన్లలో.. సుమారు 90శాతం మంది తెలుగు వారే అయ్యేలా చేసింది.

రెండేళ్లు బాగానే గడిచాయి. సంక్రాంతి పండగ కూడా బాగానే జరిగింది. అప్పటికే.. ఈ యూనివర్సిటీ కార్యకలాపాల మీద అనుమానం ఉన్న అధికారులకు కొన్ని సాక్ష్యాలు లభించాయి. ఆన్‌లైన్ విద్యావిధానంలో భోధించే ఈ విశ్వవిద్యాలయానికి ఎక్కువ వీసాలు మంజూరయిన విషయం కూడా వారు గమనించారు. ఇక కోర్సుల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది వేర్వేరు ప్రదేశాల్లో పనిచేస్తున్నట్లు ఆధారాలు దొరికాయి. అధికమొత్తంలో డబ్బు కట్టించుకుని.. అమెరికా చట్టాలకు వ్యతిరేకంగా.. స్టూడెంట్ వీసాలు ఇప్పించారని యూనివర్సిటీ డైరెక్టర్లపై కేసు నమోదు చేశారు. యూనివర్సిటీకి చెందిన రెండు ఆఫీసులను, విద్యార్థుల హాస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిరవధికంగా యూనివర్సిటీని మూసివేస్తూ అటార్నీ జనరల్ ఇచ్చిన ఆదేశాలను అమలుపరచారు.

అయితే.. ఇప్పుడు బాధంతా.. లక్షల రూపాయల డబ్బు కట్టించుకున్న యూనివర్సిటీని అర్ధంతరంగా మూసేశారని కాదు. ఆ యూనివర్సిటీ విద్యార్థులుగా రిజిస్టర్ చేసుకుని చదువుతున్నవారు, ఇప్పటికే కోర్సు కంప్లీట్ చేసుకుని ఉద్యోగ వేటలో ఉన్నవారి గురించే. అమెరికన్ చట్టాల ప్రకారం వీసా కోసం మోసం చేయటం నేరం. ఆ నేరంలో పాలుపంచుకున్న వారందరూ శిక్షార్హులు. ఇప్పుడు ఆ నేరంలో ఈ విద్యార్ధులు అందరూ ఇరుక్కున్నారు. ఎవరో కొంతమంది.. అమెరికాలో డబ్బు సంపాదించుకునేందుకు స్టూడెంట్ వీసాతో రావటం.. ఆ విద్యార్థులను కష్టాల్లో పడేసింది. చేయని తప్పుకి శిక్ష అనుభవించేలా చేస్తోంది. సుమారు పది రోజుల్నుంచి జరుగుతున్న ఈ వ్యవహారంతో.. వెయ్యిమంది తెలుగు విద్యార్థులు గదిలోంచి బయటకు రాకుండా భయంభయంగా గడుపుతున్నారు. కంటికి కునుకు, కడుపుకి తిండి దూరమై.. భవిష్యత్తు అంధకారమై.. అంతాకలిసి ఒక్కటిగా ఏడుస్తున్నారు. రోడ్డు మీదికొస్తే ఎక్కడ అరెస్టు చేస్తారో.. అన్న భయంతో.. ఆహారం తెచ్చుకోలేక.. తమ ఉనికిని బయటి ప్రపంచానికి తెలియనివ్వకుండా చీకటిలో.. మౌనంగా రోదిస్తున్నారు.

యూనివర్సిటీని మూయించిన పోలీసులు.. విద్యార్థుల వేట మొదలుపెట్టారు. దొరికిన వారిని అరెస్టు చేస్తున్నారు. మిగిలిన వారి ఆచూకీ చెప్పండంటూ వేధిస్తున్నారు. హంతకులు, తీవ్రవాదులకు బిగించినట్లుగా.. జిపిఎస్ ట్రాకర్లను తగిలిస్తున్నారు. ఆ జిపిఎస్ ట్రాకర్ల సహాయంతో.. ఎప్పుడు విచారణకు అవసరమైనప్పుడల్లా.. స్టూడెంట్ ఎక్కడున్నాడో తెలుసుకోవచ్చు. సరిగ్గా ఆ ప్రదేశానికి వెళ్లి బలవంతంగానైనా.. వారిని లాక్కెళ్లవచ్చు.

ఎక్కడైనా ఓ అమెరికన్‌కు చిన్న అపకారం జరిగిందంటే.. తోకతొక్కిన పాములా లేచే పెద్దన్నకు మిగిలిన ప్రజల మానమర్యాదలు పట్టటం లేదు. కనీస మర్యాద లేకుండా ప్రవర్తిస్తూ.. మానవ హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తున్న అమెరికాకు, ఆ దేశ పోలీసులకు ఎదురుచెప్పే సాహసం మిగిలిన దేశాలకు లేదు.. ముఖ్యంగా ఇండియాకు. తాము ఇన్నాళ్లూ కష్టపడి చదివిన చదువు, తమ తల్లిదండ్రులు కూడబెట్టిన డబ్బు అన్యాయమైపోతోంటే చూడలేక.. చూస్తూ బతకలేక నరక వేదన పడుతున్న వారు.. ఏంచేయాలో తెలియక పిచ్చివాళ్లైపోతున్నారు.

ఇక ఈ విద్యార్థులను అక్కడికి పంపిన కన్సల్టెన్సీలు తమ తప్పేంలేదని వాదిస్తున్నాయి.

సుమారు వెయ్యిమంది విద్యార్థులు.. అదీ తెలుగు వాళ్లు.. అతిదీన పరిస్థితుల్లో ఉంటే.. మన ప్రభుత్వాలకి చీమ కుట్టినట్లైనా లేకపోయింది. యాత్రలు చేస్తూ మన ముఖ్యమంత్రి, అమ్మగారి అనుగ్రహంపై ప్రధానమంత్రి కాలం గడుపుతున్నారు. వారానికి పైగా సమయం వారు నరకం అనుభవించాక.. విపక్షాలు లేఖలు రాసిన తర్వాత.. తీరిగ్గా కేంద్రప్రభుత్వం స్పందించింది. ఆ విద్యార్థులకు కావలసిన న్యాయ సహాయం అందించాలని రాయబార కార్యాలయాన్ని ఆదేశించింది.

ట్రైవ్యాలీ యూనివర్సిటీ బాగోతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కాబట్టి తెలుస్తోంది. మరి వందల సంఖ్యల్లో.. ఏడాదికి రెండు మూడు సార్లు అమెరికా, బ్రిటన్, జర్మనీ, స్విట్జర్లాండ్ లాంటి వివిధ దేశాలనుంచి వస్తున్న యూనివర్సిటీల ప్రతినిథులకు హెచ్చరికలు, అక్కడికి వెళ్లే విద్యార్థులకు సూచనలు చేయాల్సిన బాధ్యత ఎవరిది? డబ్బు కట్టించుకుని దొంగ వీసాలు ఇస్తున్న ట్రావెల్ ఏజన్సీలపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాయి? ముందు వీసా ఇచ్చి.. ఆ తర్వాత రెండేళ్లకు ఆకులు పట్టుకున్న అమెరికాను ఏమనాలి? తప్పు చేసిన వారిని వదిలి అమాయకులను హింసిస్తూ మానవ హక్కుల ఉల్లంఘన చేస్తోన్న అక్కడి పోలీసులను ఏంచేయాలి? ఇవీ.. సగటు తెలుగోడి ప్రశ్నలు.. వీటికి సమాధానం ఎవరు చెబుతారు?


Update:  భారత ప్రభుత్వ ఒత్తిడికి అమెరికా తలొగ్గింది. కాలిఫోర్నియాలోని ట్రై వ్యాలీ యూనివర్సిటీ వల్ల మోసపోయిన భారత విద్యార్థుల కోసం అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. ఫారెన్ ఎఫైర్స్ మినిస్ట్రీని సంప్రందించడానికి ఇ మెయిల్ అడ్రస్, వాయిస్ మెయిల్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. సహాయం కావలసిన విద్యార్థులు 415 - 844-5320 అనే నెంబర్‌కు ఫోన్ లేదా వాయిస్ మెయిల్ చేయవచ్చు.SFRHSIFraud@dhs.gov అనే ఈ మెయిల్‌ ఐడికి తమ కంప్లెయింట్లను పంపించవచ్చు.