1, డిసెంబర్ 2008, సోమవారం

కార్గిల్ వీరులకు చెప్పండి.

ఆ వీర స్వర్గంలో

మన కార్గిల్ వీరులు కనిపిస్తే

చెప్పండి, ఈ కుర్చీలలో

ఎవరు కూర్చున్నా ఒకటేనని,

దేశభద్రత గాల్లో దీపమేనని.


భూతల స్వర్గంకోసం

జరిగే దాయాదుల పోరులో

మరణించిన సైనికుల

శవపేఠికల సొమ్ముతినే

రాబందుల దేశమిదని.


అధికారం చాలు మాకు

బాధ్యతలక్కర లేదు,

కుర్చీలకై పాకులాటలో

క్షణం తీరిక లేదు,

ప్రజల రక్షణకేమీ చేయలేమని.


గుడ్డి నిఘా వ్యవస్ధకు తోడు

చట్టం కుంటిదయింది.

న్యాయం మూగబోయింది.

మీ శౌర్యం, మీ ప్రతాపం స్కూలు

పిల్లల పాఠాలుగ మిగిలాయని.


మరో జన్మంటూ మీకుంటే

మీ ఈ దేశానికే రావాలని..

సైనికులుగా కాదు, నిజాయితీ

క్రమశిక్షణతో దేశదిశను మార్చే

నాయకులుగా రమ్మని.

జోహార్లు మీకు

భరతమాత ముద్దుబిడ్డలారా..
జోహార్లు మీకు!

మీడ్యూటీ మేం చేయనివ్వం,
మీరు మరణిస్తే మాత్రం
కోటి పరిహారాలిస్తాం.

కార్గిలైనా, పార్లమెంటైనా
ఎర్రకోటైనా, హోటల్ తాజ్ మహలైనా
మీ పోరాటాన్ని గుర్తుంచుకుంటాం
ధరల వేడి తగలగానే మేం మర్చిపోతాం.

తీవ్రవాదానికి మాదగ్గర
కఠిన శిక్షలుండవు. ఈ దేశానికి
అత్తారింటికి వచ్చినట్లు వచ్చే
ఉగ్రవాద అల్లుళ్లకుకాల
యాపన సపర్యలు చేస్తాం.

మనదేశంలో మేముండేందుకు
అవకాశం లేని చోట,
మీరాష్ట్రం, మీప్రాంతం కానిచోట
మీ ప్రాణాలను మాకోసం అర్పిస్తే,
గుండెలనిండా స్వేచ్చావాయువు
పీల్చి మీకు సెల్యూట్ చేస్తాం.

మా కులపోడికి తప్ప
అభివృద్ధిని అందనివ్వం
మా మతమోడితో తప్ప
మంచిమాట మాట్లాడం
ఐనా మీత్యాగాలను మర్చిపోం
సంవత్సరానికొక్కసారి
మీ ఫోటోలకు నివాళులర్పిస్తాం.