18, జూన్ 2010, శుక్రవారం

ఆత్మ'హత్య'

గుట్టలు గుట్టలుగా
శవాల కుప్పలు

తల లేని మొండెం
ఆత్రంగా తడుముకుంటోంది

ఆగిపోయిన శ్వాస
నిశ్శబ్ధంగా ఆవిరవుతోంది

మూతబడిన కనులు
రెప్పల్లోంచి చూస్తున్నాయి

తెరుచుకున్న నోరు
కొత్త వేదం పలుకుతోంది

తెగిపడిన చేయి
గుండె కోసం వెదుకుతోంది

రాబందుల రెక్కలతో
కాళ్లు ఎగురుతున్నాయి

చుట్టూవాలిన ఈగలు
మౌనగీతం పాడుతున్నాయి

దూరంగా నేను
మౌనంగా చూస్తున్నాను

ఆత్మను చంపి
అంత్యక్రియలు చేస్తున్నాను

17, జూన్ 2010, గురువారం

అదేంటో..

మనసు వెనక తడి తెరలను తడుముతానా?
చేతుల నిండా బాధ నెత్తురు.

జ్ఞాపకాల దొంతరలను కుప్పలు పోస్తానా?
అన్నీ అస్పష్టపు మాటలు.

చుక్కలనన్నీ లెక్కపెడదామని కూచుంటానా..?
పారిపోయిన చీకటి జాడలు.

కన్నీటి ఊబిలో సగం కూరుకుపోతానా?
పగిలిన గుండె ముక్కలు.అదేంటో..

నీకేదో చెబుదామని మొదలుపెట్టానా?
మనసు మరచి పోయాను.

పానీ'పట్టు'

వేసవి వెళ్లిపోతోంది..
టీవీల పుణ్యమాని
రుతుపవనాలు వచ్చేశాయట!

రాజధాని నగరంలో
మంజీరా నీరు మాత్రం
వారానికొక్కసారట!

వారానికి కూడా రాకపోతే..?
అమాయకుడా..
జీహెచ్‌ఎంసీ ట్యాంకరొస్తుందోయ్!నీటి కోసం యుద్ధం చేసే
తెగువ నీకుంటే..
బిందె నీళ్లు దక్కించుకునే
పట్లు నీకు తెలిసుంటే..
వెళ్లు.. అక్కడ తలబడు.
క్రాఫు చెరగకుండా..
షర్టు నలగకుండా..
బయటకొచ్చి కనిపించు!
పది బిందెల
పానీ పంపకానికి
ఆరు బిందెల నీరు
రోడ్డు పాలు.
భాగ్యనగర జన దాహానికి
అధికారుల మొండి వైద్యం
శిగపట్లు తెలిసుంటేనే
పానీపట్టు పనిలో విజయం!!

***************************************************
మౌలాలీ ఏరియాలో వారానికి ఓసారి మంజీరా నీరు సరఫరా చేస్తున్నారు.
అదీ అందరూ ఆఫీసులకు, పనికీ వెళ్లిన సమయంలో. లేదా అందరూ నిద్ర పోతున్న సమయంలో.
ఇక పైపులైన్లు బాగోకపోతే.. అధికారుల జాలి, దయ మీద ఆధారపడాలి.
ఎవరైనా వార్డు నాయకుడు గొడవ చేస్తే..
కంటి తుడుపు చర్యగా.. ఇలా ట్యాంకర్లను పంపిస్తారు.
మీరూ మీరూ కొట్టుకు చావమంటారు.
ఇంకో విషయం ఏంటంటే, ఈ ట్యాంకర్ డ్రైవర్‌కు ఒక్కో ఇంటి నుంచి పది రూపాయలు ఇవ్వాలిట.
జనానికి సరఫరా ఆపి మరీ నీటి వ్యాపారం చేస్తున్న HMWSB ఆదర్శమనుకుంటా ఆ డ్రైవర్‌కు.

1, జూన్ 2010, మంగళవారం

రండి.. 'స్టింగ్' చేద్దాం

డజను న్యూస్ ఛానళ్లలో
అరడజను వార్తలకు
డజనున్నర వ్యాఖ్యానాలు చూసే
ప్రేక్షకుడికి కాసింత వినోదం దొరికింది

ఎవడినైనా విఐపి చేసేందుకు
మైకులతో కొట్టుకునే మిత్రులు
ఒకరిని ఒకరు 'కుట్టుకునే'
పనిలో బిజీగా మారారివాళ

స్వాములు, సన్యాసులు, సన్నాసుల
చుట్టూ తిరిగి మోసపోయే
జనానికి కళ్ళు తెరిపించే ప్రయత్నం
'బ్రేక్' లేకుండా సాగుతోంది

మీడియాకు మీడియా
పరమ శతృవనే నిజం
టీఆర్పీల వేటలో నగ్నంగా
నిరూపిస్తోంది 'ఈ' జర్నలిజం

పసలేని వాదనలో
చివరికి ఎవరు ఓడినా
గెలిచేది మాత్రం భరిస్తున్న
ప్రేక్షక మహానుభావులు

అబ్బ.. తెలుగోళ్లకు మంచి
రోజులొచ్చాయి
మీడియాకు ముకుతాడు పడే
ముహూర్తాలు దొరికాయి