మరో పోరుకి రంగం సిద్ధమవుతోంది..
కొత్త సంవత్సరం వస్తోందంటేనే..
నాయకులు, విద్యార్థులు మొదలు
అందరిలోనూ ఉత్కంఠ
పెరిగిపోతోంది!
ఏళ్ల తరబడి పేరుకు పోయిన
సమస్య తేనెతుట్టెను
కదిలించినదొకరు..
జస్ట్.. చిటికెలో
పరిష్కరిస్తామని ప్రామిస్ చేసి..
వెనకడుగు వేసిందొకరు..
దెబ్బ తిన్న చోటుని
వదిలేసి.. సేఫ్ ప్లేసుకి
వెళ్లిపోయింది మరొకరు..
అక్కడా.. ఇక్కడా.. మేమే
అంటూ.. గోడెక్కి
కూచుందింకొకరు..
వీళ్ల వల్ల కాదు..
మమ్మల్నినమ్మండంటూ
ఆశ పెడుతోందొకరు..
అంతా మా నాన్నదీ, నాదే..
వచ్చేస్తున్నానంటూ
కేకలు పెడుతోందింకొకరు..
వీళ్లంతా ఒక వైపుంటే..
నీక్కావలసిందీ.. మా దగ్గరుందీ..
అంటూ ఊరిస్తూ, వయ్యారాలు వొలకబోస్తూ
ఆ ఊరూ.. ఈ ఊరూ..
తిరుగుతున్న గుంపొక వైపు...
పరిస్థితి అదుపుతప్పనివ్వమంటూ
కేంద్ర బలగాలను రప్పించే
ప్రభుత్వ వర్గాలు..
నోరు జారితే జాగ్రత్తంటూ..
ముందుజాగ్రత్తలు చేస్తున్న
పోలీసు బాసులు..
వీళ్లంతా మరోవైపు..
ఎవడి మనోభావాలు
ఎప్పుడు దెబ్బతిన్నా..
బలైపోవటానికి సిద్ధంగా
ఆర్టీసీ బస్సులు, విద్యార్థుల జీవితాలు
బిక్కుబిక్కుమంటూ.. భవిష్యత్తుకోసం
చూస్తున్న మధ్యతరగతి మనుషులు
ఇంకో వైపు.
వీళ్లందరి మధ్య..
ఆసులో గొట్టంలా తిరుగుతూ..
అక్కడిదిక్కడా.. ఇక్కడిది అక్కడా..
మాటల మూటలు మోస్తూ తిరిగే
నయా నారద పాత్రలో
మన మీడియా!
ఇదీ రాష్ట్ర ప్రస్తుత పరిస్థితి.
దేశమంతా చలితో వణుకుతోంటే
ఇకముందేమవుతుందో అనే
ఆందోళనతో తెలుగోడు వణుకుతున్నాడు.
తన ప్రమేయం ఏమీ లేకుండానే..
తన చుట్టూ జరుగుతున్న యుద్ధ ఏర్పాట్లను చూసి
భయంతో బెదిరిపోతున్నాడు.
పారబోయే రక్తం
తనదో.. తన అన్నదో, తమ్ముడిదో..
అక్కదో, చెల్లిదో.. అమ్మానాన్నలదో..
తేల్చుకోలేక సతమతమవుతున్నాడు.
ఎవరికి ఏం నచ్చకపోయినా..
కొంచెం ఆగమంటూ చేతులెత్తి మొక్కుతున్నాడు.
డబ్బు, అధికారం కోసం.. పేరు, ప్రాపకం కోసం..
ఎవడో దూకమన్న చోటల్లా దూకకుండా..
ఆలోచించి అడుగేయమంటూ
వేడుకుంటున్నాడు.
Image Courtesy: Life.Com
తాళి
12 సంవత్సరాల క్రితం