3, నవంబర్ 2009, మంగళవారం

ఇలా కూడా జరుగుతుందన్నమాట!

మీరు ఆర్‌టీసీ బస్సెక్కారా?
అందునా హైదరాబాదులో?
సరే.. మరో ప్రశ్న.. మీరు పురుషులా? (సారీ మగవాళ్లు అనాలంటే భయంగా ఉంది. ఎక్కడ నన్ను కూడా సభ్యత లేని బ్లాగర్ అంటారో అని)
అంత కోపమొద్దండీ బాబూ..
"అసలు విషయం చెప్పకుండా ఏంటీ ప్రశ్నల గోల?" అనుకుంటున్నారా?
మళ్లీ క్వశ్చన్? ఓకే ఓకే..

అసలేమైందంటే..
శనివారం ఇంటికి(తెనాలి) వెళ్లి బుద్ధిగా నిన్న మధ్యాహ్నం హైదరాబాద్ తిరిగి వచ్చా, జన్మభూమి ఎక్స్‌ప్రెస్‌లో. వచ్చేసరికి రాత్రి ఏడయింది.
ఇ.సి.ఐ.ఎల్ బస్ కోసం ఉప్పల్ బస్టాండ్, అదేనండీ.. రేతిఫైల్ బస్‌స్టాండ్‌కి లెఫ్ట్ సైడ్ ఉంటుందీ.. మదర్ థెరిసా విగ్రహంకి దగ్గరలో ఉంటుందీ.. తెలుసా..? ఐతే ఓకే..
ఆ ఉప్పల్ బస్‌స్టాండ్‌లో 24ఇ బస్ ఎక్కా. (బస్ నెంబర్ ఎపి10జెడ్ 3552. )
బస్ ఆ టైములో అసలు ఖాళీ ఉండకూడదు. కానీ ఉంది కొంచెం.
7.15కి బయల్దేరింది.
అలా అలా.. ప్యాట్నీ బస్ స్టాప్‌కి చేరుకుంది 7.30 దాటిన తర్వాత.

ఇద్దరు ముసలి వాళ్లు(పురుషులు) ఎక్కారు. బస్ అప్పటికే ఫుల్ అయింది. బస్ మొత్తం ఒక లుక్ ఇచ్చి సీనియర్ సిటిజన్స్ అని రాసి ఉన్న సీట్ దగ్గరికి వెళ్లారు.  అప్పటికే ఆ సీట్‌లో ఇద్దరు స్త్రీలు కూర్చుని ఉన్నారు. ఆ ముసలివారిలో ఒకాయన వాళ్లని సీట్‌లోంచి లేవమన్నారు. వాళ్లకి అర్ధమయ్యేలోపే మరొకాయన 'ఇది సీనియర్ సిటిజన్స్ సీట్ అమ్మా..' అని చెప్పి లేపారు.
పాపం ఆ స్త్రీలిద్దరూ లేచి పురుషులకు సీటిచ్చారు.

ఇప్పుడిదంతా ఎందుకు రాశానంటే.. ఆడవారి సీట్లలో కూర్చున్న మగవారిని దబాయించి మరీ లేపే ఆడవారు హైదరాబాదులో మనకు అక్కడక్కడా కనిపిస్తూనే ఉంటారు. ఖాళీగా ఉంది కదా అని ఏపురుషుడైనా స్త్రీల సీట్‌లో కూర్చున్నా.. బిక్కు బిక్కుమంటూ కూర్చోవలసిందే.. ముందు స్టాపులో ఎక్కడ స్త్రీలెక్కుతారో.. ఎక్కడ లేవమంటారో అని. అప్పటికీ ఎక్కినా అసలు వాళ్లని పట్టించుకోనట్లు.. సారి, అస్సలు స్త్రీలను మేము కన్నెత్తి చూడమన్నట్లుగా తల పక్కకు తిప్పుకుంటారు, చూస్తే ఎక్కడా లేవాల్సొస్తుందో అని. మనలో మన మాట, నేను కూడా అంతే అనుకోండి..
ఎవరైనా ముందుకొచ్చి 'లేవండి, ఇది లేడీస్ సీట్' అంటే అప్పుడు ఈ రిజర్వేషన్ కల్పించిన వాడెవడో కనిపిస్తే, వాడి పని చెబ్దామన్నంత కోపమొస్తుంది కదా..

అదిగో అలాంటి ఫీలింగే ఆ ఇద్దరు ఆడవారిలో కూడా చూశానప్పుడు.

అసలైతే.. ఆ సీనియర్ సిటిజన్ సీట్‌లో స్త్రీలు కూడా కూర్చోవచ్చు. ముసలి స్త్రీలు ఉన్నా కూడా వాళ్లు వేరే సీట్లో కూర్చోవటంతో పురుషులకి అవకాశం వచ్చిందన్నమాట.

ఒక మాట: నేనేమీ స్త్రీలకు వ్యతిరేకం కాదు. చాలా కామన్‌గా ఎక్కువ మందికి కనిపించే సీన్ కాబట్టి రాద్దామనిపించింది. అంతే.