ఆరోజుల్లో రెండు రకాల విత్తనాలను
కలిపి ఒక హైబ్రిడ్ విత్తనాన్ని తయారు చేశారు.
అన్నదమ్ముల ఇళ్ల మధ్య ఆ నాటిన ఆ విత్తనం
మొక్కై.. పెరిగి మానై పోయింది.
తియ్యటి పండ్లను ఆ ఇళ్ల యజమానులకు,
కొందరు కుటుంబ సభ్యులకు అందించింది.
ఏ ఇంటి అన్నదమ్ములు కలిసున్నారు?
మనస్ఫర్ధలొచ్చాయి. విడిపోదామనుకున్నారు.
ఇన్నాళ్లూ కలిసున్న వారికి అన్యాయం గుర్తొచ్చింది.
ఆ చెట్టు కాయలు నువ్వెక్కువ తీసుకున్నావని ఒకరంటే..
లేదు, ఆ చెట్టు కలప నువ్వే ఎక్కువ
వాడుకున్నావని మరొకరన్నారు.
కాయలు లేక మా వాళ్లు నీరసపడి
పోయారని ఒక కుటుంబ సభ్యుడంటే..
అసలు చెట్టు నీడ లేక
మా వాళ్లు ఎండలో మాడిపోతున్నారని
మరొక పెద్దమనిషి అన్నాడు.
చెట్టు కాండం ఉంది నీ చోటులోనే కదా అంటే..
కాయలు అందుతోంది నీకే కదా అని ఎదురు ప్రశ్న!
పెద్దలు తిట్టుకోవటం చూసి
ఇంట్లో పిల్లలు కొట్టుకోవటం మొదలుపెట్టారు.
చివరకు చెట్టుని పట్టించుకోవటం మానేశారు.
అప్పుడప్పుడూ పట్టే చెద
ఈసారి రెచ్చిపోయింది.
నాతో పాటూ వాడికి కూడా నష్టమేలే..
అని ఇరుపెద్దలు అనుకున్నారు.
చూస్తూ కూర్చున్నారు.
పిల్లలు ఒక కొమ్మమీద చెదను
మరో కొమ్మమీద ఒదిలిపెట్టారు.
ఇప్పుడు ఆ చెద
చెట్టునంతా ఆక్రమించింది.
కాండం సారమంతా పీల్చివేస్తోంది.
ఆకులు రాలిపోతున్నాయి.
చెట్టుపై పక్షులు ఎగిరి పోతున్నాయి.
అందమంతా తరిగిపోతోంది.
ఇప్పటికైనా మేల్కొనక పోతే
ఆ చెట్టుకి కాయలు కాయవు.
కాసినా రసంలేని పుచ్చిన కాయలు!
ఆ యింటి వాళ్లూ తినలేరు,
మరొకరికి ఇవ్వలేరు!!
చెదలు పట్టిన, ఆకులు రాలిన
ఆ చెట్టునీడ ఎందుకూ పనికి రాదు!
ఏ పక్షీ గూడు కట్టేందుకు ఆసక్తి చూపదు!!