3, జులై 2009, శుక్రవారం

వీరప్పన్ లాగే ప్రభాకరన్ కూడా! (Interview - First Part)




గత నెలలో నెల్లూరు దగ్గర ఒక ఊరు వెళ్లాను. అక్కడ ఒకతను పరిచయమయ్యాడు. పేరు శ్రీనివాస దురై. వయసు 65-70. తమిళనాడులొని చెంగల్పట్టు దగ్గర ఓ పల్లెటూరు. ఇప్పుడు అతని పరిచయం ఎందుకంటే.. అతను వీరప్పన్‌నీ, ప్రభాకరన్‌నీ చూశాడు. మాట్లాడాడు. వాళ్ల గురించి కొద్దిగా.. మిగిలిన వాళ్లకి తెలియవనుకుంటున్న విషయాలు చెప్తానన్నాడు.

"సరే" అని ఒక హోటల్‌లో కూర్చున్నాం.

నేను: మీకు మాత్రమే తెలిసిన ఆ విషయాలేంటో చెప్పండి.
శ్రీనివాస దురై: వీరప్పన్ చాలా మంచివాడబ్బా.. తన వాళ్లకోసం చాలా చేశాడు.
నేను: ఎవరైనా తన వాళ్లకోసమే కదండీ ఏం చేసినా.. లేకపోతే వాళ్లేమైనా చనిపోయాక తీసుకుపోతారా? ఆమాత్రం తెలుసులెండి ఎవరికైనా..
శ్రీనివాస దురై: అదికాదబ్బా.. వీరప్పన్ చుట్టూ చాలా బలగం ఉండేది. తమిళనాడు-కర్ణాటక మధ్యన అతని సామ్రాజ్యం. ఊటీ-మైసూరు మధ్యన అడవుల్లోని చెట్లన్నీ అతనికి పరిచయమే. ఎవడైనా అతని అనుమతి లేకుండా అటువైపు వెళ్లాడా.. ఇక అంతే. ప్రాణాలమీద ఆశలొదులుకోవాల్సిందే!
నేను: అంటే చంపేస్తాడా?
శ్రీనివాస దురై: ఉత్తినే చంపడబ్బా.. ముందు అనుమానంగా తిరిగేటోడ్ని ఆడ(అక్కడ) జనాలే పట్టుకుంటరు. సత్యమంగళం అడవుల్లో అతని మనుషులు చాలామందే ఉండారు. ముందు నువ్వెవరూ అంటారు. ఈడకెందుకొచ్చినవ్, ఎట్లొచ్చినవ్ అంటారు. ఆడు సరైన సమాధానం చెప్పాడా.. బతికిపోతాడు. ఆ వచ్చినోడు పోలీసోడు కాదని వాళ్లు నమ్మాల. నమ్మితే తిండి పెట్టి దారి చూపిస్తరు. లేకపోతే ఈడ్చుకుపోతరు.
నేను; ఎక్కడికి?
శ్రీనివాస దురై: ఇంగెక్కడికి? వీరప్పన్ మనుషులు మురుగేశన్, సుబ్రమణి లాంటోళ్ల దగ్గరికి. ఆళ్లు కొట్టి, హింసించి అడుగుతరు. అప్పటికీ ఆడు నిజం చెప్పలేదో.. సరాసరి పులి నోట్లోకే..
(నేను బ్లాంక్ ఫేస్ పెట్టాను) వీరప్పన్ దగ్గరకబ్బా.. కళ్లకు గంతలు కట్టి ఎక్కడో అడవుల్లో 40-50కిలోమీటర్లు నడిపిస్తరు. కావాలనే నడిపిస్తరు. కొండచుట్టూ పది సార్లు తిప్పుతరు. అమ్మ.. ఇక వాడి పని ఐపోతుంది అనుకున్నప్పుడు, వీరప్పన్ ముందు నిలబెడతరు. ఈలోపు రెండు రోజులు గడుస్తయి.
నేను: ఎందుకలా.. కొండ చుట్టూ తిప్పటం? అనవసరంగా వాడిని తిప్పటంతో బాటు వీళ్లకి కూడా కాళ్లనొప్పులు కదా?
శ్రీనివాస దురై: మరదే.. ఆడి ఒంట్లో ఓపిక మొత్తం అయిపోవాల. నాలుక ఎండిపోవాల. పట్టపగలే చుక్కలు కనిపించాల. అప్పుడు కదా.. వాడు ఎక్కడికీ తప్పించుకునే ఆలోచన చేయకుండా గమ్మునుండేది? ఆ 50కిలోమీటర్లు పోయేలోగా వాళ్లు పట్టేసుకుంటారని అనుకుంటడు. పారిపోటానికి కూడా భయపడుతడు.
నేను: మరి వాళ్ల మనుషులమాటో?
శ్రీనివాస దురై: వాళ్లదేముండాదబ్బా.. వంతులేసుకుని తిప్పుతరు. నలుగురు పోయిన తర్వాత ఇంకో నలుగురు వస్తారు. వాడ్ని మళ్లీ చుట్టూ తిప్పుతరు.
నేను: అలా తిప్పటం వలన వాళ్లకేంటి లాభం?
శ్రీనివాస దురై: డబ్బులబ్బా.. నిండా దుడ్డు ఇచ్చేదున్నప్పుడు వేరే పని ఏం చేస్తారు?
నేను: మరి వీరప్పన్ ఏంచేస్తాడు తర్వాత?
శ్రీనివాస దురై: వెళ్లగానే తాగటానికి నీళ్లిస్తడు. మర్యాదగా అడుగుతడు. అప్పటివరకు వీరప్పన్ రాక్షసుడని విన్నోడికి అలా మంచిగా కనిపించేసరికి భయం పోతుంది. మనసులో ధైర్యం వస్తుంది. వీరప్పన్ అంటే ఇంతేనా అనిపిస్తుంది. అదిగో అక్కడే నోరు జారతడు. ఎక్కువ వాగేస్తడు.
నేను: అంటే, నిజం చెప్తాడా?
శ్రీనివాస దురై: అక్కడిదాకా వెళ్ళాక వాడు నిజం చెప్పినా అంతే.. చెప్పకపోయినా అంతే. చావే.
నేను: ఇప్పుడేగా మంచిగా ఉంటాడన్నావ్?
శ్రీనివాస దురై: అవునబ్బా.. చావబోయేటోడ్కి గుక్కెడు మంచినీళ్లు పోస్తే పుణ్యమొస్తదని వాళ్లమ్మ చెప్పినాదంటలే. ఏదైనా చెప్పేది వీరప్పన్ ముందుకెల్టానికి ముందే చెప్పాల. ఒప్పుకోవాల. అక్కడికెల్లాక ఒకటే.. చెప్పినదాని బట్టీ పద్ధతి బట్టీ చావు రకం ఉంటుంది.
నేను: రకాలేంటీ?
శ్రీనివాస దురై: ఎక్కువగా కాల్చి చంపుతరు. వాడు పొగరుగా మాట్లాడితే.. నరికి చంపుతరు. ఎక్కువ బాధ అనుభవించాలి కదా.. శవాన్ని పూడ్చిపెట్టటమో.. నదిలో విసిరేయటమో చేస్తారు.
నేను: ఇంత రాక్షసంగా ఉంటే మంచివాడంటావేం?
శ్రీనివాస దురై: అక్కడికే వస్తున్నానబ్బా.. వీరప్పన్ ఏనుగు దంతాలు, గంధం చెట్లను కొట్టించీ సంపాదించింది ఎవరికోసం? అసలు వీరప్పన్‌కి ఎంత డబ్బు వస్తదో, ఎట్ల వస్తదో తెలుసునా?
నేను: ఎలా?
శ్రీనివాస దురై: బ్రోకర్లబ్బా.. పావు వంతు వీరప్పన్‌కిస్తే ముప్పావు వంతు వాళ్లే తిన్నరు. వాళ్లే బాగు పడ్డరు. వచ్చిన దాన్ని అందరికీ పంచిపెట్టేటోడు. బలగమా.. ఎక్కువ. సంపాదన తక్కువ. తనకంటే కుటుంబం లేకపోయే.. చుట్టూ ఉన్నోనికి ఉంటుంది కదా.. వాడు ఇంట్లో ఇచ్చుకోవాలకదా? అందరూ ముత్తు(వీరప్పన్ భార్య)లా ఉండరు కదా..
నేను: అంటే.. వీరప్పన్ ఏమీ దాచుకోలేదా?
శ్రీనివాస దురై: ఏముందబ్బా దాచుకోటానికీ? పెళ్లామా.. రానియ్యదు. పిల్లకేమో తండ్రిని చూసిన గుర్తేలేదు.
నేను: మరి అన్ని నేరాలెందుకు చేశాడంటావ్?
శ్రీనివాస దురై: చూడబ్బా.. నిన్ను ఒక వేషంలో చూసినప్పుడు జనం భయపడ్డారనుకో.. నీకు ఇష్టమున్నా లేకపోయినా అదే వేషం వేస్తావ్. నిన్ను చూసి జనం భయపడేటప్పుడే నీ చుట్టూ కొంతమంది మూగుతరు. ఆ వేషం నువ్వు తీయకుండా కాపలా కాస్తరు. వీరప్పన్ కూడా అంతే. జనంలో అతనంటే భయం పోతుందనుకున్నప్పుడు ఒకడ్ని చంపేటోడు. చుట్టూ ఉన్నోళ్లు వీరప్పన్ పేరు చెప్పి చంపేటోళ్లు.
నేను: మరి కిడ్నాపులు..
శ్రీనివాస దురై: అవి కూడా జనంలో, పేపర్లలో ఉండేందుకే.
నేను: పేపరంటే గుర్తొచ్చింది. గోపాల్(నక్కీరన్ పత్రిక) ఎలా కలిశాడు?
శ్రీనివాస దురై: ఎట్లా ఏముండాదబ్బా? మీరెట్లా కలుస్తారు, నక్సలైట్లనీ? అట్లే.
నేను: మరింకేం తెలుసు వీరప్పన్ గురించి?
శ్రీనివాస దురై: వీరప్పన్‌కి అడవి, అందులో చెట్లు, జంతువులు అన్నీ పరిచయమే. ఏ మొక్క దేనికి పనికొస్తదో.. ఏదిక్కున పొతే ఏమొస్తదొ.. ఎంత దూరంలో వస్తదో అంతా తెలుసు.
నేను: అడవిలో అన్నేళ్లు ఉంటే ఎవరికైనా తెలుస్తుందిలే..
శ్రీనివాస దురై: అట్లనమాక. వీరప్పన్ కనక అలా స్మగ్లింగూ.. చంపటాలు చెయ్యకపోతే.. ఒక పెద్ద సైంటిస్టు అయ్యేవాడు. ఎవరికీ తెలియని కొన్ని మూలికలుండేవి తెలుసా? అవి కాచి టీ లాగా తాగితే ఎంత పెద్దనొప్పులైనా చిటికెలో పోతాయంటారు. అలాంటివే లేకపోతే అన్నాళ్లు ఆ ఆడవిలో ఎలా ఉండేవాడు?
నేను: నువ్వు చూశావా పెద్దాయనా?
శ్రీనివాస దురై: లేదు. కాకపోతే వీరప్పన్ ప్యాంటు జేబులో ఉంటాయంటారు. నేను చూసినప్పుడు మాత్రం జేబులు ఎత్తుగానే ఉన్నాయి మరి.
నేను: డబ్బులేమో?
శ్రీనివాస దురై: అమాయకుడిలా ఉన్నావే.. అడవిలో డబ్బులెందుకు?
నేను: అంతేలే.. మరి రాజ్‌కుమార్‌ని కిడ్నాప్ చేశాడుకదా.. ఎందుకు?
శ్రీనివాస దురై: ఎందుకేంటి? అప్పుడు తమిళనాడు, కర్ణాటకలో అతనిమీద ఒత్తిడి పెరిగింది. జనమా..పోలీసులకి భయపడుతున్నారు. తిండికి కూడా కష్టమవుతోంది. ఏం చేస్తాడు? సూపర్‌స్టార్‌ని కిడ్నాప్ చేశాడు. రాజ్‌కుమార్ అతని దగ్గరున్నప్పుడు పోలీసులు వెనక్కెళ్లారు. డబ్బు తీసుకుని చనిపోయిన తన మనుషుల ఇళ్లలో ఇచ్చాడు.
నేను: వీరప్పన్ డబ్బుని అడవిలో దాచిపెట్టాడంటారు కదా..
శ్రీనివాస దురై: అతని దగ్గర అంత డబ్బెక్కడిదబ్బా.. వచ్చేదే తక్కువ. వచ్చిన దాంట్లో కూడా.. పంచేదెక్కువ. ఐనా వీరప్పన్‌కి తెలుసబ్బా తననెప్పుడో కుక్కలా కాల్చిచంపేస్తారని. కాకపోతే తనతో పాటు పోలీసులను కూడా పైకి తీసుకెళ్లాలని అనుకునేవాడు.
నేను: మరైతే వీరప్పన్ ఎన్‌కౌంటర్ నిజమేనని నమ్ముతావా నువ్వు?
శ్రీనివాస దురై: మనదేశంలో జరిగిన అన్ని ఎన్‌కౌంటర్‌లలో ఎన్ని నిజమంటే నువ్వేం చెప్తావ్? నువ్వు నమ్మినా నమ్మకపోయినా ఒప్పుకోవాల. అంతే.

(సశేషం)