“ప్రపంచంలోనే బహు సుందరమైన ప్రేమకథ”గా విమర్శకుల మన్ననలు పొందిన కథ ఇది.
“సామాజికంగా సరికొత్త విలువలు, వ్యవస్ధలు పాదుకొల్పుకుంటున్న సంధి దశలో కిర్గిస్తాన్ ఎదుర్కొన్న జాతీయ, సాంఘిక, సైద్ధాంతిక సంఘర్షణలకు అద్దం పడుతుందీ” రచన.
కిర్గిస్తాన్ రచయిత “చింగీజ్ ఐత్మాతోవ్”కు ప్రపంచవ్యాప్త గుర్తింపు తెచ్చిన నవల జమీల్యా.
ఈ పుస్తకాన్ని నవల అనే కంటే కూడా పెద్ద కథ అంటే సరిపోతుందేమో!
కిర్గిజ్, రష్యన్ భాషలలో వెలువడిన ఈ కథ ప్రపంచవ్యాప్తంగా ఎన్నో భాషలలోకి అనువదింపబడింది. భారత దేశంలో రష్యన్ రచయితల ప్రాభవం, ప్రభావం పెరుగుతున్న 1950లలో ఈ పుస్తకాన్ని తెలుగులోకి ఉప్పల లక్ష్మణ రావు గారు అనువదించారు.
ప్రధాన పాత్రలు, పరిస్ధితులు:
ఈ కథ కిర్గిస్తాన్‌లోని కుర్కురోవ్ అనే గ్రామం నేపధ్యంగా సాగుతుంది.
జర్మనీతో జరుగుతున్న యుద్ధంలో రష్యా తరపున ప్రతి యువకుడు పాల్గొనాల్సిన పరిస్ధితి. గ్రామాల్లో వృద్ధులు, పిల్లలు, వికలాంగులు తప్ప మగదిక్కు ఉండని వాతావరణం. “పండే ప్రతి గింజ యుద్ధభూమికే” అన్న నినాదంతో యుద్ధంలో పాల్గొంటున్న సైనికుల అవసరాలకోసం, ఇంకా చెప్పాలంటే ప్రతి స్త్రీ తన భర్త, కొడుకుల కోసం పొలంలో శ్రమించాల్సిన అవసరం అప్పటిది.
యుద్ధభూమి నుండి ఏదైనా ఉత్తరం గాని, ఎవరైనా సైనికుడు గానీ వస్తే తమ వారి గురించీ, యుద్ధ వాతావరణం గురించి అడిగి తెలుసుకునే దాకా అందరిలోనూ ఉత్కంఠ నెలకొంటుంది.
ఈ పరిస్ధితులలో ఆ కుర్కురోవ్ గ్రామంలో ఉన్న మన కథకుడు సయ్యద్ తన ఆలోచనలనూ, అనుభవాలనూ పాఠకులతో పంచుకుంటాడు.
సయ్యద్: తన చుట్టూ తన ప్రమేయం లేకుండా జరుగుతున్న సంఘటనలను మౌనంగా చూడటం తప్ప సమర్దించటం లేదా వ్యతిరేకించటం చేయలేని పరిస్ధితి అతనిది. కథాసమయం నాటికి అతని వయసు పదిహేను లేదా పదహారేళ్లు. ఇద్దరు అన్నలు యుద్ధంలో చనిపోతారు. అమ్మ, నాన్న, పిన్ని, ఒక చెల్లెలు, మారుటి అన్న, వదిన.. ఇతని కుటుంబం. చిత్ర కళ అంటే ఆశక్తి.
సాదిక్: సయ్యద్‌కు మారుటి అన్న. సరిగా చెప్పాలంటే.. సాదిక్ నాన్న చనిపోయాక కట్టుబాటు ప్రకారం, అతని అమ్మను సయ్యద్ నాన్న పెళ్లి చేసుకుంటాడు. జర్మనీతో జరుగుతున్న యుద్ధంలో పాల్గొనేందుకు మిగిలిన యువకులతో పాటు తప్పనిసరి పరిస్ధితులలో యుద్ధానికి వెళతాడు. అప్పటికే పెల్లైన ఇతను భార్య అంటే వస్తువుగా, మగాడి ఆస్తిలో భాగంగా చూసే అప్పటి సమజానికి అసలైన ప్రతినిధి.
జమీల్యా: సయ్యద్ భార్య. ఒక గుర్రపు వ్యాపారి కుమార్తె. కొత్త కోడలిగా వచ్చిన ఆమెకు ఆదరించే ఇద్దరు అత్తలు దొరుకుతారు. పెళ్లి ఐన వెంటనే భర్త యుద్ధానికి వెళతాడు. అత్త మామలకు తోడుగా వ్యవసాయ పనులు చేస్తుంది. తన “చిట్టి మరిది”తో ఆటలు ఆడుతుంది. ఊళ్లో ఎవరైనా తమలపాకుతో ఒకటిస్తే, ఈమె తలుపు చెక్కతో రెండిస్తుంది.
ధనియార్: మాజీ సైనికుడు. చిన్ననాడే కుర్కురోవ్ గ్రామం వదిలిపోయినా, యుద్ధంలో గాయపడిన తర్వాత తిరిగి స్వగ్రామం చేరుకుంటాడు. ఆ ఊళ్లో పొలం పుట్ర ఏమీ లేని కారణం చేత గ్రామ సమిష్టి వ్యవసాయ క్షేత్రంలో అతనికి కూలీగా పని ఇస్తారు పెద్దలు. ఒకరి జోలికి పోకపోవటం, ఎవరితోనూ స్నేహంగా ఉండకపోవటం వలన ఇతనంటే ఆ ఊరి పిల్లలకు లోకువ, పెద్దలకు అనాసక్తి.
కథలోకి వెళ్తే..:
సయ్యద్ ఒక సామాన్య యువ రైతు తన బాల్యం, కుటుంబం, అందులో అనుకోకుండా వచ్చి పడిన కొన్ని పరిస్ధితులను విశ్లేషించుకుంటూ తన మనసులోని మాటలను కథ రూపంలో మనకు చెప్తాడు. ఒక చిత్రాన్ని గురించి వివరిస్తూ కథలోకి దారి తీస్తాడు.
అతని స్వంత అన్నలు ఇద్దరు, మారుటి అన్న సాదిక్ యుద్ధానికి వెళతారు. వడ్రంగి ఐన తండ్రి, కుటుంబ పెత్తనం అంతా ఇతని తల్లికే వదిలేస్తాడు. అతని పిన్ని, సాదిక్ భార్య- జమీల్యా పక్కనే ఉన్న “చిన్న ఇంట్లో” ఉంటారు. జమీల్యా అంటే అతనికి ఎంతో అభిమానం. గోధుమ పంటను రైల్వే స్టేషనుకు గుర్రపు బండ్లపై తీసుకువెళ్లేందుకు జమీల్యా అవసరం పడుతుంది. “ఆడకూతురుని నేను పంపను” అని సయ్యద్ అమ్మ ఆ గ్రామ సమిష్టి వ్యవసాయ క్షేత్ర అధికారితో గొడవ పడుతుంది. చివరకు సయ్యద్ తోడుగా ఉంటాడనీ, ఇంకా కావాలంటే ధనియార్ కూడా వస్తాడనీ చెప్పటంతో ఒప్పుకుంటుంది.
తర్వాతి రోజు ఉదయం నుంచి వీరు ముగ్గురు గోధుమలు తీసుకెళతారు. స్వతహాగా వాగుడుకాయలైన జమీల్యా, సయ్యద్‌లు దారంతా ధనియార్‌ను వెక్కిరిస్తారు. అతనిపై జోకులేస్తారు. ఉదయం వెళ్లిన వారు తిరిగి రాత్రికి గానీ ఊరు చేరలేరు కాబట్టి వచ్చేటప్పుడు అంత దూరం వెన్నెల కాంతిలో ప్రయాణాన్నీ, “సైపు” మైదానాలలో గుర్రపు బండ్ల పోటీగా మార్చుకుంటారు. తిరుగు ప్రయాణంలో జమీల్యా పాడే పాటలు ఆ వెన్నెల రాత్రులని మరింత అందంగా చేస్తాయి. ఆ పాటలు ధనియార్‌ను ఆకర్షిస్తాయి. అతను జమిల్యాను చుస్తూ ఉండిపోతాడు. ధనియార్‌ను విసిగించేందుకూ, అతనికి కోపం తెప్పించేందుకూ ప్రయత్నాలు చేస్తారు ఆ వదినా మరుదులు.
అప్పటికీ వారు సఫలం కాక అతని బండిలో ఎక్కువ బరువు ఉన్న బస్తాలను వేస్తారు. గోధుమ బస్తాలను షెడ్డులో పెట్టే క్రమంలో ఆ అధిక బరువు బస్తాతో ధనియార్ పడిన శ్రమ అతనంటే ఒక రకమైన భయాన్ని కలిగిస్తుంది. అప్పుడు అతను చూసిన చూపు జమీల్యాలో అపరాధ భావనను కలిగిస్తుంది.
తర్వాత కొన్ని అల్లరి లేని ప్రయాణాల తర్వాత జమీల్యానే ధైర్యం చేసి ధనియార్‌ను పాడమంటుంది. అతని పాట జమీల్యాను కరిగించి వేస్తుంది. జమీల్యా మనసు పొరల లోలోపలి భావాలకు అర్ధం తెలుస్తున్నట్లవుతుంది. ఇన్నాళ్లూ తను ఎదురు చూసిన వస్తువేదో తనను పిలుస్తున్నట్లనిపిస్తుంది. ఆ గాన ప్రవాహం, ఉధృతి సయ్యద్‌ను అతనికి అభిమానిగా మారుస్తుంది. మళ్లీ రోజులు మామూలు కంటే సంతోషంగా మారతాయి. ప్రయాణంలో పాటల తోడుతో అలసట తెలియదు.
ఒకరోజు రైల్వే స్టేషను దగ్గర కలిసిన సైనికుడు జమీల్యా భర్త సాదిక్ రాసిన ఉత్తరాన్ని అందిస్తాడు. అది చూసిన ధనియార్ ఒక్కడే వెళ్లిపోతాడు. సాదిక్, గాయాలు తగ్గిపోయేకా, ఒక నెలలో తిరిగి వస్తానని రాస్తాడు. సయ్యద్‌ను కూడా వెళ్లిపొమ్మంటుంది జమీల్యా. అలా మొదటిసారిగా ముగ్గురూ ఒంటరిగా తిరుగు ప్రయాణమౌతారు.
ఆ రాత్రి పొలం చేరుకున్న తర్వాత ధనియార్ దగ్గరకు వెళతాడు సయ్యద్. అతనిని పలకరించలేక కొంచెం దూరంగా గడ్డిలో పడుకుంటాడు. తర్వాత వచ్చిన జమీల్యా ధనియార్ దగ్గరకు రావటం చూస్తాడు. వాళ్లిద్దరి కళ్లలో బాధ గమనిస్తాడు. జమీల్యా ధనియార్‌తో మాట్లాడుతుంది. అతను కొంచెం సంతోషంగా చూడటం గమనిస్తాడు సయ్యద్. “జమీల్యా మాటలు అతన్ని ఎందుకు ఊరడించాయో కదా? అనుకున్నాను. ఒక వ్యక్తి భారంగా నిట్టుర్చుతూ: “నాకు భరించడం సులభమనుకుంటున్నావా?” అని అంటే, ఆ మాటల్లో ఊరడింపుకి ఏముందంటా?” అని ఆలోచిస్తాడు.
తర్వాతి నుంచీ మామూలే. ధనియార్ పాటలు ఆమెను ఎక్కడికో తీసుకు పోతాయి. అతని బండి పక్కగా నడుస్తూ, పాటలో లీనమై పోయి ఆమె అతని పక్కన కూచుంటుంది. అతని భుజాలపై తల ఆనించి పరవశం చెందుతుంది. ఆ సన్నివేశాన్ని సయ్యద్ చుస్తూండిపోతాడు. తేరుకున్న జమీల్యా బండిదిగి ఇద్దరినీ కసురుకుంటుంది.
తర్వాతి రోజు ఒక కాగితాన్ని, బొగ్గు ముక్కను సంపాదించిన సయ్యద్ బండిపై జమీల్యా, ధనియార్‌లు కూర్చుని ఉండటాన్ని చిత్రిస్తాడు. తమను తాము మైమరచిన ప్రేమికులలా అనిపిస్తారు వాళ్లిద్దరూ అతనికి. ధనియార్‌ను చూస్తే అతనికి ఈర్ష్య కలుగుతుంది. ఆ చిత్రాన్ని జమీల్యా తీసేసుకుంటుంది. చిన్నప్పుడు బడిలో వదిలేసిన చిత్రకళను తనకు ఇష్టమైన వారి చిత్రాలతో తిరిగి ప్రారంభించటంతో సంతోషిస్తాడు.
ఒక రాత్రి పొలం పక్కన ఏటి ఒడ్డుకు వెళ్లిన అతనకి దూరంగా రెండు ఆకారాలు కనిపిస్తాయి. అవి రెండూ జమీల్యా, ధనియార్ అని గుర్తించటానికి అతనికి ఎక్కువసేపు పట్టదు. ఏటి అవతలి గట్టుపై దూరంగా వెళ్తున్న వారిద్దరినీ చూసి, తేరుకుని వెంట పరిగెత్తుతాడు. కాలికి ఎదురు రాళ్లదెబ్బలతో వెళ్లినా చీకటిలో కలిసిపోయిన వారిద్దరూ కనిపించరు. ఉదయం ఇంటికి వచ్చాక తెలుస్తుంది, అనుకున్నదే అయిందని. లోపల సంతోషపడినా ఏమీ తెలియనట్లే ప్రవర్తిస్తాడు. ఊరంతా ఒక కుటుంబ మర్యాద పోగొట్టిన జమీల్యా గురించే కథలు కథలుగా చెప్పుకుంటారు.
యుద్ధం నుంచి వచ్చిన సాదిక్ జమీల్యాను చంపేస్తానంటాడు. ఎక్కడున్నారో తెలియక ఊరుకుంటాడు. ఒకరోజు ఆవేశంతో వచ్చిన సాదిక్, “ఇ చిత్రం నువ్వు గీసినదేనా? వీడెవడు?” అని అడుగుతాడు. “ధనియార్” అని చెప్తాడు సయ్యద్. చెంప పగలకొట్టి ఆ చిత్రాన్ని చింపేస్తాడు సాదిక్. “నీకు తెలుసా?” అని అడిగిన తల్లికి “అవున”ని సమాధానమిస్తాడు.
తనకు చిత్రకళను నేర్చుకోవాలని ఉందని, వెళ్లేందుకు తల్లిని అనుమతి కోరతాడు సయ్యద్. చిత్రకళ డిప్లొమాకోసం మళ్లీ అదే చిత్రాన్ని చిత్రికరిస్తాడు. ఆ చిత్రాన్ని చూసిన ప్రతిసారీ గుర్తు వచ్చే గ్రామాన్ని, జమీల్యాను తలచుకుని తిరిగి ఇంటికి వెళ్లాలనుకోవటంతో కథ ముగుస్తుంది.
రచయిత గురించి:
కిర్గిజ్ జాతిపితగా పిలవబడుతున్న ఐత్మాతోవ్ 12-12-1928న అప్పటి సోవియట్ రష్యా యూనియన్‌లో భాగమైన కిర్గిస్తాన్‌లో జన్మించారు.
గిరిజన సంచార కుటుంబంలో జన్మించిన కారణంగా ఆయన ఎక్కువ ప్రదేశాలను, అక్కడి ప్రజలనూ, కట్టుబాట్లనూ గమనించటానికీ, అర్థం చేసుకోవటానికీ ఆయనకు అవకాశం దక్కింది. చిన్నప్పటినుంచి తను గమనించిన విషయాలనే ఆయన తన రచనల్లో వ్యక్తీకరించారు.
“రచయిత తన అంతరాత్మను ఆవిష్కరించటం కంటే కూడా తన సమాజం అంతరాత్మగా ధ్వనించటమే ముఖ్యం” అన్న మాక్సిం గోర్కీ మాటలు తననెంతో ప్రభావితం చేశాయంటారు రచయిత.
1990లలో రష్యా నుండి విడిపోయి స్వతంత్ర దేశంగా అవతరించిన కిర్గిస్తాన్‌కు అంతర్జాతీయ సమాజంలో ఒక గుర్తింపు, గౌరవం దక్కేందుకు చింగీజ్ ఐత్మాతోవ్ ఎంతో కృషి చేశారు.
ఎన్నో దేశాలకు కిర్గిస్తాన్ రాయబారిగా కూడా పని చేసిన చింగిజ్ ఐత్మాతోవ్ 10-06-2008న జర్మనీలో చనిపోయారు.
నా అభిప్రాయం:
ఈకథ (రెండవ ప్రపంచ యుద్ధం) సమయానికి, సోవియట్ యూనియన్ అంతర్భాగమైన రష్యాలొ స్త్రీ స్వాతంత్ర్యానికి అనుకూలంగా జరిగిన అనేక సంఘటనలు అప్పటి సమాజంలో స్త్రీకి కొంత ధైర్యాన్ని, సమాజ కట్టుబాట్లను ఎదిరించే తెగువను ఇచ్చాయి. అటువంటి పరిస్దితులలో జమీల్యా తనని మనిషి మాత్రంగా నైనా చూడని భర్త సాదిక్ నుంచి విడిపోయి తనకు నచ్చిన ధనియార్‌తో వెల్లేందుకూ, తద్వారా సమజాన్ని ఎదిరించేందుకు సాహసం చేసింది.
ఈకథ చదివిన తర్వాత స్త్రీ అంటే వస్తువే అనే భావం కేవలం భారతదేశంలోని ప్రజలది మాత్రమే కాదనీ, అప్పటి ప్రపంచ వ్యాప్తంగా సంప్రదాయాలను పాటించే ఆనాటి ప్రజలందరిదీ అని తెలుస్తుంది. భర్త చనిపోయిన స్త్రీ, ఆ కుటుంబంలో భర్త సోదరున్ని/అదే వంశస్ధున్ని వివాహమాడాలన్న నిబందన కూడా కనిపిస్తుంది.
అలాగే, ఈకథ యుద్ధం ఎటువంటి పరిస్ధితులను సృష్టిస్తుందో తెలియజేస్తుంది. వ్యవసాయం చేసేందుకు మగవారు లేని సమయంలో స్త్రీ, తన చిన్న పిల్లలతో పడే కష్టాలు, భర్త దగ్గర లేని స్త్రీ ఎదుర్కునే వేధింపులు కనిపిస్తాయి.
మనం ఇప్పుడు మాట్లాడుకుంటున్న “సమిష్టి వ్యవసాయ క్షేత్రాలు”, “అందరూ కలిసి పని చేయటం” అప్పటికే ఉన్నాయనీ, సరైన వ్యవస్ధ ఉంటేకానీ అవి విజయవంతమవవనీ గమనించవచ్చు.
Published @
Pustakam.net