సాయంత్రం ఉబుసుపోక, కాసేపు
సినీ జనాలను చూద్దామనుకునే..
సాధారణ అభిమానికి
అది పండగే..
కాదా ఏంటి?...
సుత్తి కొట్టే ఉపన్యాసాలు వినక్కరలేకుండా..
అమోఘమైన.. అద్భుతమైన.. సాంప్రదాయ నృత్యాన్ని
(రెప్ప వేయకుండా) కన్నులు చెమర్చేలా చూసిన వారికి..
అది పండగే..
అంతే కదా..
రెండు మనస్తత్వాల వ్యక్తులను దగ్గర చేసే..
స్నేహం రంగు, రుచి, వాసన చూసిన
మామూలు మనుషులకు
అది పండగే..
ఎప్పుడో పాతికేళ్ల క్రితం..
గొంతు నిండా సిరా మింగిన
ఓ మామూలు సోకాల్డ్ రచయిత..
సినీవీధుల్లో తిరిగి తిరిగి..
అలసి చివరకు తనక్కావలసినదేదో
తానే వండుకుని..
మంచి వంటవాడిగా పేరు తెచ్చుకుని..
టాలెంట్ అంటే.. ఇతడిదే..
అన్నంతగా ఎదిగితే..
బహుశా ఎవరూ పండగ చేయరు..
వాడేదో.. వాడి బతుకేదో అనుకుంటారు.
కానీ,
ఆ వర్సటైల్ ఆర్టిస్టు..
హ్యూమనిస్టై.. ప్రతి ఒక్కరి
గుండెల్లో అరెస్టై..
ఆ మృష్టాన్న భోజనాన్ని..
అందరికీ పంచిపెడితే..
ఎవరు మాత్రం పండగ చేయరు?
వెండి పండగే చేస్తారు!
అదే జరిగింది.
రవీంద్రభారతి అందుకు వేదికైంది.
పాన్ పరాగ్‌లు, గుట్కాలతో
పళ్లు ఊడగొట్టుకుని,
సిగరెట్ల పొగగొట్టాలతో
కవితలు ఊదేస్తూ..
మందుబాబులతో కలిసి
భోళాశంకరుడికి అర్చన చేసేవాడిపై
ప్రజలు అభిమానం కురిపించారు.
మాతృ భాషంటే పడి చచ్చే పిచ్చోడికి..
తెలుగు సినిమాకు
ఆస్కార్ మోసుకొచ్చేద్దామనే
మూర్ఖపు మొండి వాడికి,
అప్పుడెప్పుడో..
శ్రీనాధుడికి చేసిన
కనకాభిషేకం చేశారు.
కలం, గళం సొంతం చేసుకుని
ఆ కైలాస వాసుడిని
పొగుడుతూ, తెగుడుతూ..
తిరిగే.. నాటకాలోడికి
సువర్ణ కంకణం తొడిగారు.
అయినా..
ఆ ముక్కంటి ఖర్మ కాకపోతే..
ఇతగాడ్ని భక్తుడిగా చేసుకోమన్నదెవడు?
ఒక పెళ్లాన్ని నెత్తిమీద పెట్టుకుని,
మరో భార్యకి అర్ధభాగం ఇచ్చినోడికి
మర్యాదెవడిస్తాడు?
రంగస్థలమైనా.. వెండితెరైనా..
గురువులకెప్పుడూ శిష్యుడు,
శిష్యులకు మాత్రం తండ్రిలాంటోడు
ఇకనుంచి
కవులకు, రచయితలకు
గుండెధైర్యం కాబోతున్నాడు..
ఇకనుంచి ప్రతి ఏడాది..
తన పుట్టిన రోజున
దమ్మున్నోడికి అవార్డిస్తాడు.
----------------------------
మరికొన్ని ఫోటోలు:
సకుటుంబ సమేతం |
ఎంత పెద్ద వాడైనా.. అమ్మకి కొడుకే.. |
నిజ భార్య శ్రీమతి దుర్గా భవానితో.. |