5, ఫిబ్రవరి 2011, శనివారం

జైబోలో తెలంగాణ.. హిట్! (సినిమా రివ్యూ మాత్రం కాదు)

ఆగండి.. ఆగండి.. నేనింకా ’జై బోలో తెలంగాణ’ సినిమా చూడనే లేదు. ఇక రివ్యూ ఎలా రాయగలను చెప్పండి? ఐనా ఇప్పటికే పదుల సంఖ్యలో మన బ్లాగర్లు ఆ సినిమా గురించి రాసేశాక నేను రాసేదేముంది?

నా సోది ఏమిటంటే..

తెలంగాణ ఉద్యమంపై ఓ సినిమా తీస్తానని దర్శకుడు శంకర్ ప్రకటించిన రోజు నుంచీ.. రాష్ట్ర ప్రజల్లో ఓ విధమైన ఆసక్తి నెలకొంది. ఇక ’జైబోలో తెలంగాణ’ సినిమా మొదలైనప్పటినుంచి.. అందరిలో ఉత్కంఠ కూడా పెరిగిపోయింది. నటులకు కుల, మత, ప్రాంతీయ భేదాల్లేవంటూ జగపతి బాబుని ఒప్పించటంలో శంకర్ సక్సెసయ్యారు. ఒక ఆంధ్రా వాడు తెలంగాణ సినిమాలో హీరోనా అని అడిగిన ప్రజలకు, ప్రజా సంస్ధలకు ఆయన ఏదో సమాధానం చెప్పి ఒప్పించారు. ఆ తర్వాత సినిమాలోని మిగిలిన తారాగణంగా.. మా గురువు గారు మల్లేపల్లి లక్ష్మయ్య, తెలంగాణ తల్లి ముద్దు బిడ్డ దేశపతి శ్రీనివాస్, నీటిపారుదల రంగ నిపుణుడు విద్యాసాగర్ గారు, సీనియర్ జర్నలిస్టు అల్లం నారాయణ.. ఇలాంటి ప్రముఖులను నటింప జేశారు. పల్లె పదాలతో అద్భుత సాహిత్య సృష్టి చేయగల గోరటి వెంకన్న, ప్రతి మాటలో నిప్పు పుట్టించగల గద్దర్, ఎవరితో ఎలా మాట్లాడితే ఉద్యమ సెగ రగులుతూనే ఉంటుందో తెలిసిన కేసీఆర్.. ఇలాంటి మహామహులతో సినిమా పాటలకు అక్షర మెరుగులద్దించిన శంకర్ రిలీజ్ చేయటానికి ముందే సినిమాను విజయవంతం చేసుకున్నారు. సెన్సార్ బోర్డు అభ్యంతరం చెప్పగానే.. వెల్లువలా ఎగసిన నిరసనలు ఈ సినిమాపై ప్రజల ఆసక్తిని అందరికీ చూపించాయి. ముందు అనుమతి ఇవ్వబోమని మొండికేసిన సెన్సార్ బోర్డు.. చివరకు ’ఎ’ సర్టిఫికెట్‍తో ప్రదర్శనకు పర్మిషన్ ఇచ్చింది.

సినిమా రిలీజ్‌ చేసుకుంటారు సరే.. తెలంగాణలో తప్ప ఎవరు చూస్తారనుకున్న నాలాంటి వారికి అనూహ్యమైన సంఘటనలు కనిపించాయి. నాలుగు రోజులు పని ఉండి గుంటూరు జిల్లా తెనాలి వెళ్లిన నాకు, అక్కడ ఓ ధియేటర్‌లో ’జైబోలో తెలంగాణ’ ప్రదర్శనకు ఏర్పాట్లు జరుగుతుండటం ఆశ్చర్యమనిపించింది.


ఒకప్పుడు తెలంగాణ మాటెత్తితే ఊరుకోని చోట ఈ సినిమాను అంత ధైర్యంగా ఎలా ప్రదర్శించబోతున్నారో తెలుసుకుందామనిపించింది. ఇదే మాట ఆ సినిమా హాలు ఉద్యోగిని అడిగితే.. "డబ్బెవరికి చేదు?" అని ప్రశ్నించారు. అన్ని ముఖ్యమైన జె‌ఎసిల నుంచి హామీలు తీసుకున్నారని ఆ తర్వాత తెలిసింది. సినిమాలో అభ్యంతరకరమైనవి లేకపోతే తాము అడ్డంకి కాబోమని జె‌ఎసిలు హామీ ఇచ్చాయిట. పోనీలే.. ప్రొడ్యూసర్‌కి నష్టం కలిగించటం లేదు.. అని నేను కూడా ఊరుకున్నా. ఫిబ్రవరి మూడున గుంటూరు నుంచి హైదరాబాద్ వస్తున్న సమయంలో కొందరు జర్నలిస్టు మిత్రులు, విద్యార్ధి నాయకులు నాగార్జున యూనివర్సిటీ జె‌ఎసి ఇచ్చిన హెచ్చరిక గురించి మాట్లాడారు. ఏమిటా హెచ్చరిక? "సీమాంధ్రులను కించపరిచే ఏ ఒక్క డైలాగైనా జగపతి నోటి వెంట వస్తే.. అతనికి పరపతి లేకుండా చేసి, తిరుపతిలో గుండు కొట్టిస్తాం" అని. "సరే, ఎవరో కవిహృదయం బాగా ఉన్న వ్యక్తి స్టేట్‌మెంట్ తయారు చేశాడు, నిజంగా జగపతి బాబు మీతో తిరుపతి వస్తాడా?" అని నా ప్రశ్న. నువ్వెక్కడి జర్నలిస్టువిరా అన్నట్లు చూశారు అక్కడున్న వాళ్లు నన్ను. "జె‌ఎసిలు చెప్పినవన్నీ చేయవు.. జనంలో మనం పలుచన కాకూడదనే ఎక్కడి జె‌ఎసి స్టేట్‌మెంట్ ఇచ్చినా..  ఆమాత్రం తెలీదా?" రివర్స్ క్వశ్చన్!
ఆ చర్చలో అనుకున్న విషయం.. "తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలు, అక్కడి పరిస్థితులపై మన వాళ్లకు ఇంకొంచెం ఎక్కువ అవగాహన రావాలన్నా.. ఈ సినిమా ఇక్కడ కూడా ఆడాలి. ఎటువంటి అడ్డంకి ఉండకూడదు. ఇలా చేయటం వల్ల అక్కడి ప్రజల్లో మన సినిమాల పట్ల కూడా కొద్దిగా సానుకూలత వస్తుంది. ఎవడో ఏదో అన్నాడని ప్రతి సారీ సినిమా రిలీజ్‌లను అడ్డుకునే వారు తగ్గుతారు. వాళ్లకు ఇవ్వాల్సిన మామూళ్లు తగ్గుతాయి. ఏమో.. అదే జగపతి బాబుని పెట్టి ఇంకెవరో డైరెక్టర్ ’జై సమైక్యాంధ్ర’ అనే సినిమా తీయావచ్చు.. ఈ సినిమాలో ఆంధ్ర వారి గురించి చేసిన కామెంట్లకు బదులు చెప్పావచ్చు.. ఎవరు చూశారు?" నాకైతే ఇది బోడిగుండుకీ, మోకాలికీ ముడి పెడుతున్నట్లనిపించింది.

కానీ.. ఇప్పుడు నాకనిపిస్తోందిది..
"తెలంగాణ విముక్తి పోరాటంలో ఆంధ్ర మహా సభలు, వాటిని నడిపిన ఆంధ్ర కమ్యూనిస్టు యోధుల గురించి ప్రజలు మరిచిపోయారు. నిజాం సేనలకు వ్యతిరేకంగా దొరల గడీలపై తిరగబడిన బందగీ గుర్తున్నాడు కానీ.. ఆ బందగీతో కలిసి వ్యూహరచన చేసిన వారెవరో మనకు తెలియదు. దొర కన్ను పడిన ప్రతి స్త్రీ చీకటి పడేవేళకు గడీకి వెళ్లాలన్న నిజాలను, ఈ  అకృత్యాలను, అత్యాచారాలను చూసి చూసి కడుపు మండి.. "నా పెళ్లాం నీ గడీకి రాదు దొరా!" అని గళమెత్తిన వారిని గుర్తు చేయాలని ఉంది. అప్పటి ప్రజలది నిజాం పాలన నుంచి విముక్తి పోరాటమే కానీ, ఆంధ్రుల వ్యతిరేక ఉద్యమం కాదని చెప్పాలని ఉంది. రైతాంగ పోరాటం సమయంలో ఊళ్ల నుంచి పారిపోయి.. హైదరాబాద్, ఆంధ్ర రాష్ట్రాల్లో ఆశ్రయం పొంది.. ఇండియన్ యూనియన్ సైన్యాలతో పాటే గ్రామంలోకి తిరిగొచ్చిన దొరలను, వారికి మేకతోలు కప్పి తీసుకువచ్చిన అప్పటి కాంగ్రెసు పెద్దలను ప్రశ్నించాలని ఉంది. పెద్దమనుషుల ఒప్పందం, ముల్కీ నిబంధనల ద్వారా లభించాల్సిన సమాన న్యాయానికి పాతరేసిన నాయకులను ప్రశ్నించాలని ఉంది. వలసపోతున్న ప్రజానీకం, ముంబయి, గల్ఫ్ ఎడారుల్లో దీనుల గాధలను వివరించాలని ఉంది. ప్రపంచం కుగ్రామమవుతున్న ఈ సమయంలో.. లక్షల కొద్దీ ఉద్యోగాలను హాం.. ఫట్ అంటూ సృష్టిస్తామంటున్న నాయకులను, వారిని నమ్మి మోసపోతున్న అమాయక విద్యార్థులను పరామర్శించాలని ఉంది. పరీక్షలు రాసి తల్లిదండ్రుల ఆశలు, ఉన్నత చదువులు, ఉద్యోగాలంటూ తిరిగే యువతరం ఒకవైపు.. అమ్మనాన్నల తరం సాధించలేకపోయిన దాన్ని చేసి చూపుతాం అంటూ ప్రాణాలను పణంగా పెడుతున్న ఉడుకు రక్తం మరోవైపు.. తెలుగువాడి జీవితపు నాణెంలోని రెండుముఖాలను చూపాలని ఉంది. కవులు, కళాకారులకు ప్రాంతం, మతం భేదాలు లేవంటున్న నాయకులు, రచయితలు... మా ప్రాంతం వారికి తగిన గుర్తింపు రావట్లేదు.. అని చేసే వాదనలకు సమాధానం చెప్పాలని ఉంది. టాలెంట్ ఉన్న వారికీ, లాబీయింగ్ వచ్చిన వారికీ మాత్రమే అవార్డులు, రివార్డులు వస్తాయన్న మినిమం నాలెడ్జ్ లేదా అని ప్రశ్నించాలని ఉంది. మా నాయకులను మేమే నడిపిస్తాం అంటున్న కొందరు యువకులను చూసి నవ్వు వస్తోంది. అవసరం తీరే వరకే ఏ నాయకుడైనా మన మాట వింటాడు కానీ.. ఆ తర్వాత ఎందుకు పట్టించుకుంటాడు? నాయకులను ఎదిరించి ప్రాణాలు కోల్పోయిన వారు వేలల్లో ఉండే ప్రస్తుత సమాజంలో.. యువకుల మాట వినే నాయకుడిని ఒక్కడిని చూపించండంటూ అడగాలని ఉంది." ఓహ్.. చాలా అయిపోయింది.

ఇదీ సంగతి.. ఎప్పుడూ నా పనేదో చూసుకునే నన్ను కూడా ఇంత సీరియస్ పోస్ట్ రాసేలా చేసింది జైబోలో తెలంగాణ చిత్రం.
ఆ చిత్రం ద్వారా ప్రతి ఒక్కరిలో కదలిక తీసుకురావాలనుకున్నదే శంకర్ మనోగతమైతే.. నిజంగా.. "జైబోలో తెలంగాణ" హిట్ అయినట్లే.