29, మార్చి 2009, ఆదివారం

టవల్ ఊయల

మీరు ఊయలలో పడుకుని ఎన్ని సంవత్సరాలయింది? అదీ చిన్నప్పుడు అమ్మ చీరలో పడుకుని?

ఈ మితృడెవరో కానీ రెండు వారాల క్రితం నేను వైజాగ్ వెళ్తున్నప్పుడు హౌరా మెయిల్ లో నా కంట పడ్డాడు. అసలే జనరల్ కంపార్ట్మెంట్.. ఆపై ఫుల్ రష్. నుంచోటానికి కూడా ప్లేస్ లేని చోట మహానుభావుడు పడకసీను వేసాడు.. ఒక చిన్న టవల్ లో. ఆ కంపార్ట్ మెంట్ 4+1 టైపు. అటుఇటు లగేజి పెట్టుకునే వాటికి మధ్య ఫ్యాను కింద హాయిగా నిద్ర పోతున్న అతనిని చూసి ఫోటో తీయకుండా ఉండలేకపోయాను. ఉన్నదానితో సరిపెట్టుకునే వారికి ఇతను చక్కని ప్రతినిధిలా కనిపిస్తున్నాడు కదూ..


కొసమెరుపేంటంటే.. "అతని టవల్ ఎక్కడ ఊడిపోతుందో.. మీద ఎక్కడ పడతాడో అని" కిందవాళ్లకి ఒకటే టెన్షన్!

28, మార్చి 2009, శనివారం

గూగుల్ చీర (సారీ.. ఇది ఊగుల్ శారీ Updated on 05-04-09)

గూగుల్ సంస్థ భారతదేశంలో ప్రచారానికి ఉపయోగించిన పద్దతులలో ఇదికూడా ఒకటి. కాకపోతే ఈ ఫోటో కనీసం రెండు సంవత్సరాల కిందటిది. ఎప్పటినుండో బ్లాగులో పెడదామనుకుంటున్నా మర్చిపోతూనే ఉన్నా.

1, మార్చి 2009, ఆదివారం

హే (రాజా) రాం!



అదిగో తగలబడుతోంది చూడు
గాంధీభవనం
పెట్రోలు,డీజిలు మంటల మధ్య
వీస్తోంది అదుపులేని పవనం.

భీంరావ్ బాడ
ఉసురువేడి తాకింది పార్టీని
పేదోడి కడుపుమంట
కాల్చింది భవనాన్ని.

నిలువనీడ లేకుండా
తరిమికొట్టిన నాయకులు
మరి ఇప్పుడెక్కడుంటారో
చుట్టూ మసి మరకలు.

ఆ వర్గీకరణేదో ఇప్పుడు
చేసేస్తే, మిగిలిన కులాలవాళ్లు
గడప తొక్కనిస్తారా? రానున్న
రోజుల్లో మూయించరా నోళ్లు??

అన్యాయం అయింది
ఒళ్లు కాల్చుకున్నోళ్లే మరి.
పని చెప్పినాయన పని
మాత్రం పరామర్శలతో సరి.

కుల రాజకీయాలు
కుటిల ప్రయత్నాలు..
అధికారం, అండ కోసం
ఆగని వీధిపోరాటాలు.

మొక్కై వంగనిది
మానైనప్పుడు వంగునా?
పెంచి పోషించిన పాము
కరవక మానునా?