వందకో, యాభైకో తనను
తాను అమ్ముకుని,
రాక్షస రతిలో భాగం పంచుకుని
చిత్ర హింసలను భరించి
సిగరెట్ వాతలు,
గోళ్ళ గుర్తులు, పంటి గాట్లతో
శరీరాన్ని ముక్కలు ముక్కలుగా
చించుకుని, కుంచించుకుపోయే
ఓ ప్రాణమున్న వస్తువు.
కట్టుకున్నవాడు చెంతలేనప్పుడు,
కన్న బిడ్డల ఆకలి కేకల కంటే
పక్క మగాళ్ల ఆశల చూపులు ఎక్కువయి
ఒకానొక బలహీన, బలాత్కార
సమయంలో, తన తప్పు లేకపోయినా
తలొంచుకు నిలబడి
కుంగి, కృశించి పోయే
ఓ అభాగ్య అనాధ.
చుట్టూ ఉన్న సమాజం
నువ్వు పతితవని, చెడ పుట్టావని
తిట్టిపోస్తుంటే.. దించిన తల పైకెత్తి
వారందరి ముఖాన ఉమ్మేసి,
మీకు చేవ ఉంటే, చేతనయితే
మీ ఇల్లు సరి చేసుకోండి.
మీ మగాళ్ళు ఇల్లు కదలకుండా
కొంగున కట్టివేసుకోండంటూ చెప్పే
ఓ వీర పతిత.
ఒక్క రోజులో
ఎందరికో తనను తాను పంచుకుని,
వచ్చిన ప్రతి ఒక్కరినీ
సంతృప్తుల్ని చేసి,
కొత్త వారికి మెళకువలు నేర్పుతూ
అనుభవాలను అలవాటుగా
మార్చుకున్న
ఓ త్యాగమయి.
కానీ,
వేశ్య అంటే..
ఆ వస్తువు, అనాధ, పతిత,
త్యాగమయి కాదు.
భాగస్వామిని మోసం చేయాలని
చూసే ప్రతి ఒక్కరూ వేశ్యలే.
వీరు దొరికితేనే వేశ్యలు.
అప్పటివరకూ
పతివ్రతలు.. లేదా పత్నీవ్రతులు.