18, నవంబర్ 2010, గురువారం

తనికెళ్ల భరణి వెండి పండగ

నిజమే..
సాయంత్రం ఉబుసుపోక, కాసేపు
సినీ జనాలను చూద్దామనుకునే..
సాధారణ అభిమానికి
అది పండగే..


కాదా ఏంటి?...
సుత్తి కొట్టే ఉపన్యాసాలు వినక్కరలేకుండా..
అమోఘమైన.. అద్భుతమైన.. సాంప్రదాయ నృత్యాన్ని
(రెప్ప వేయకుండా) కన్నులు  చెమర్చేలా చూసిన వారికి..
అది పండగే..


అంతే కదా..
రెండు మనస్తత్వాల వ్యక్తులను దగ్గర చేసే..
స్నేహం రంగు, రుచి, వాసన చూసిన
మామూలు మనుషులకు
అది పండగే..


ఎప్పుడో పాతికేళ్ల క్రితం..
గొంతు నిండా సిరా మింగిన
ఓ మామూలు సోకాల్డ్ రచయిత..

సినీవీధుల్లో తిరిగి తిరిగి..
అలసి చివరకు తనక్కావలసినదేదో
తానే వండుకుని..
మంచి వంటవాడిగా పేరు తెచ్చుకుని..
టాలెంట్ అంటే.. ఇతడిదే..
అన్నంతగా ఎదిగితే..


బహుశా ఎవరూ పండగ చేయరు..
వాడేదో.. వాడి బతుకేదో అనుకుంటారు.


కానీ,
ఆ వర్సటైల్ ఆర్టిస్టు..
హ్యూమనిస్టై.. ప్రతి ఒక్కరి
గుండెల్లో అరెస్టై..
ఆ మృష్టాన్న భోజనాన్ని..
అందరికీ పంచిపెడితే..


ఎవరు మాత్రం పండగ చేయరు?
వెండి పండగే చేస్తారు!అదే జరిగింది.
రవీంద్రభారతి అందుకు వేదికైంది.
 

పాన్ పరాగ్‌లు, గుట్కాలతో
పళ్లు ఊడగొట్టుకుని,
సిగరెట్ల పొగగొట్టాలతో
కవితలు ఊదేస్తూ..
మందుబాబులతో కలిసి
భోళాశంకరుడికి అర్చన చేసేవాడిపై
ప్రజలు అభిమానం కురిపించారు.
 
 మాతృ భాషంటే పడి చచ్చే పిచ్చోడికి..
తెలుగు సినిమాకు
ఆస్కార్ మోసుకొచ్చేద్దామనే
మూర్ఖపు మొండి వాడికి,
అప్పుడెప్పుడో..
శ్రీనాధుడికి చేసిన
కనకాభిషేకం చేశారు.


కలం, గళం సొంతం చేసుకుని
ఆ కైలాస వాసుడిని
పొగుడుతూ, తెగుడుతూ..
తిరిగే.. నాటకాలోడికి
సువర్ణ కంకణం తొడిగారు.


అయినా..
ఆ ముక్కంటి ఖర్మ కాకపోతే..
ఇతగాడ్ని భక్తుడిగా చేసుకోమన్నదెవడు?
ఒక పెళ్లాన్ని నెత్తిమీద పెట్టుకుని,
మరో భార్యకి అర్ధభాగం ఇచ్చినోడికి
మర్యాదెవడిస్తాడు?


రంగస్థలమైనా.. వెండితెరైనా..
గురువులకెప్పుడూ శిష్యుడు,
శిష్యులకు మాత్రం తండ్రిలాంటోడు
ఇకనుంచి
కవులకు, రచయితలకు
గుండెధైర్యం కాబోతున్నాడు..
 

ఇకనుంచి ప్రతి ఏడాది..
తన పుట్టిన రోజున
దమ్మున్నోడికి అవార్డిస్తాడు.
 ----------------------------
 
 మరికొన్ని ఫోటోలు:
సకుటుంబ సమేతం

ఎంత పెద్ద వాడైనా.. అమ్మకి కొడుకే..నిజ భార్య శ్రీమతి దుర్గా భవానితో..
 Photo Credits: IdleBrain.Com, Gulte.Com, GreatAndhra.com

7 comments:

కొత్త పాళీ చెప్పారు...

చాలా బావుంది. తెలుగు తెర మీద ఇంకా నటన బతికే ఉంది అని నిరూపించే వరిలో శ్రీ భరణి ఒకరు. పంచుకున్నందుకు నెనర్లు

చిలమకూరు విజయమోహన్ చెప్పారు...

తెలుగువారు గర్వించదగ్గ నటుల్లో ఒకరైన భరణిగారి గురించి మీరు చెప్పిన తీరు చాలా బాగుంది.

Sky చెప్పారు...

తమ్మీ నరేషూ,

ఇందాకే భరణీ గారికి నువ్వు రాసిన కవిత చదివి వినిపించాను. చాలా ఆనందించి బాగా రాశావని అభినందించారు. నా లైబ్రరీలో దాచుకుంటాను ఒక కాపీ పంపించమని అడిగారు- ఇంతకన్నా పెద్ద అభినందన, ఆశీర్వాదం కావాలా!!!చెప్పటం మరిచా- నిన్ను మళ్ళీ ఓసారి కలవమని చెప్పారు.

ఈ కార్యక్రమానికి వచ్చినవారు ఉబుసుపోకో లేక సినీ జనాల్ని చూడటం కోసమో రాలేదు- భరణి గారిపై ఉన్న అభిమానం, ప్రేమతో వచ్చారు. స్టార్‍డమ్ లేని, అవసరం లేని స్టార్ ఆయన. ఆ అభిమానం లేకపోతే ఈ సోకాల్డ్ స్టార్స్ లో కొందరు పిలవకపోయినా కార్యక్రమానికి ఎలా వస్తారు???? ప్రేక్షకులు కూడా ఆయన ఉపన్యాసం అయ్యేంత వరకు క్రిక్కిరిసిన ఆడిటోరియంలో నిల్చుని అంతసేపు ఎలా ఉంటారు???

పిల్లలు చేసిన సాంప్రదాయ నృత్యం చూసినంతసేపూ ఆనందం- భయం--- ఎక్కడ పడిపోతారో అని... ఆ ఉత్కంఠ బాలూ గారితో సహా అందరిలోనూ ఉంది. నిజంగా మనం అదృష్టవంతులం బ్రదర్- అంత మంచి ప్రదర్శనని చూడగలిగాం. పైగా ఓ పక్క మంగళవాయిద్యాలు- సన్నాయీ, డోలూ --- అబ్బో!!! వద్దులే కార్యక్రమానికి రాలేకపోయినవారు మనని చూసి ఈర్ష పడతారు.

సంగం సంస్థ వాళ్ళు నిజ్జంగా వెండి పండగే చేసారు-- గుడి గోపురం, శివుడు.... వెనక సప్తమీ చంద్రబింబం- దాని చూట్టూ మెరిసే తారలు.... బాలూగారు పాడిన దండకం, ఆ గాళ విన్యాసానికి మైమరచిన జనం.... తెలంగాణా మాండలికంలో వారు రాసిన శివ తత్వాలు "శభాషురా శంకరా!!!" - ఇంకా చెవుల్లో వినిపిస్తూనే ఉంది.....

ఏదైనా కార్తీక మాసం- పైగా ఏకాదశి-- దేవుడిపై నమ్మకానికీ, త్యాగానికీ ప్రతీకైన బక్రీద్ పండుగ రోజు- శివభక్తుడితో రోజంతా గడపగలిగాం మనం- ఇంకేం కావాలి బ్రదర్ మనకి????

చక్కటి కవితతో భరణి గారి వ్యక్తిత్వాన్నీ, అందమైన ఫోటోలతో నిన్నటి కార్యక్రమానికి అనుసంధానం చేసావు- ఓ మంచి కవిత చదివించావు ఈ సాయంత్రం. ధన్యవాదాలు....

సతీష్ యనమండ్ర

రాజేష్ జి చెప్పారు...

తెలుగు సినీ వినీలాకాశం లో 25 సంవత్సరాలు పూర్తిచేసుకొని, అందునా పవిత్ర కార్తీక మాసాన "వెండి పండగ" జరుపుకుంటున్న తనికెళ్ళ భరణి గారికి నా హృదయపూర్వక అభినందనలు.

ఆ శివయ్య ఆయనకి కలకాలం ఆయురారోగ్యాలు ప్రసాదించాలని కోరుకుకుంటున్నా.

ఆయన కల గళం నుంచి జాలువారిన పాట ఒక సారి,
"
నాలోన సివుడు గలడు..
నీలోన సివుడు గలడు..

నాలోన గల సివుడు నీలోన గల సివుడు, లోకము లేల గలడు

కోరితే శోకమును బాప గలడు

....
"
ఇక్కడ వినండి...
http://www.dishant.com/lyrics/religious-song-Nalona-Sivudu-Galadu-music-nalona-sivudu-galadu.html

--------

నరేష్ గారు, మీ కవిత చాలా బాగుంది.ధన్యవాదాలు.

అజ్ఞాత చెప్పారు...

రజతోత్సవాన్ని అచ్చ తెలుగులో వెండి పండగ అని వ్రాయడం చాలా బావుంది.
కొత్తగా కూడా ఉంది. ఇకముందు అందరూ ఇలాగే వ్రాస్తారేమో!

హీరో కాని భరణి గారికి ఇంతమంది ఆభిమానులున్నారంటే విశేషమే.
కాని సీతారామశాస్త్రి గారు కనపడలేదు. నేను టి వి లో మిస్సయ్యానా?

నరేష్ నందం (Naresh Nandam) చెప్పారు...

@bonagiri..

నిజమేనండీ.. ఇక నుంచి రజతోత్సవాన్ని వెండిపండగ అనే రాస్తారేమో!

హీరో కాని భరణిగారికి చాలా మంది అభిమానులున్నారు. ఆ రోజు వచ్చిన కొద్ది మందికే.. రవీంద్ర భారతి ఆడిటోరియం సరిపోలేదు. చివరి వరకూ ఓపికగా నుంచుని ఉన్నవారు నూటయాభై మంది ఉంటారు.

నాకు తెలిసీ.. తెలుగు సినీ ఇండస్ట్రీలోని ఏ వ్యక్తికీ కూడా భరణికి జరిగినటువంటి సన్మానం జరగలేదు. బహుశా ఇక ముందు జరగదు.

ప్రస్తుతం హీరోలకు, రచయితలకు, కవులకు ప్రాంతీయత్వం అంటగట్టిన మన పొలిటీషియన్ల కన్ను.. భరణిపై పడలేదు. అందుకు సంతోషం!

సీతారామశాస్త్రిగారు రాలేదండీ..

జర్నో ముచ్చట్లు చెప్పారు...

నరేశ్‌, అభినందనలు వెండి పండగ గురించి చెప్పిన తీరు బావుంది.. వాటికి తగ్గ నిశ్చల చిత్రాలూ బావున్నాయి.

వ్యాఖ్యను పోస్ట్ చెయ్యండి