అది 2009 సంక్రాంతి సమయం.. ఇండియా నుంచి వెళ్లిన తెలుగు విద్యార్థులు ట్రైవ్యాలీ యూనివర్సిటీలో అడ్మిషన్ తీసుకున్నారు. నాలుగు లక్షల రూపాయల ఫీజు, రెండు సూట్ కేసులు, కష్టపడి చదవాలనే ఒక్క కలతో అమెరికాలో అడుగుపెట్టారు. శాన్ ఫ్రాన్సిస్కో, శాన్ జోస్, సిలికాన్ వాలీకి అతి దగ్గర్లో ఈ యూనివర్సిటీ ఉండటంతో.. తెలుగువారి పరిచయాలు, వాతావరణం కనిపించాయి. హోమ్ సిక్‌ను పోగొట్టుకునేందుకు అక్కడి ట్రైవ్యాలీ తెలుగు సంఘం వారితో కలిసిపోయారు. పండగ గెస్టులుగా వచ్చిన సినీతారలు మంచు మనోజ్, లక్ష్మి ప్రసన్నలతో ఆడారు.. పాడారు..
సరిగ్గా రెండేళ్ల తర్వాత.. 2011.. అదే సంక్రాంతి సమయం.. మధ్యతరగతి కుటుంబాల నుంచి వచ్చి, అప్పులు చేసి ఫీజులు కట్టిన ఆ విద్యార్థులు రాబోయే ట్రైమిస్టర్ కోసం ప్రిపరేషన్‌లో ఉన్నారు. ఇంతలో ఉరుము లేని పిడుగులా.. ఇమిగ్రేషన్స్ అండ్ కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ అధికారులు యూనివర్సిటీలో అడుగుపెట్టారు. విద్య పేరుతో వీసాలిచ్చి మనుషుల అక్రమ రవాణాకు సహకరించారని యూనివర్సిటీ ప్రెసిడెంట్ సుసాన్ సూ మీద కేసు రిజిస్టర్ చేశారు. వీసా ఇప్పించినందుకు అధిక మొత్తంలో డబ్బు వసూలు చేశారని ఆరోపించారు. కోర్సులకు అక్రిడెటేషన్ లేకుండా విద్యాసంస్థ నడుపుతూ మోసం చేస్తున్నారని చెప్పారు. అక్కడి ఫెడరల్ కోర్టు ఆదేశాల ప్రకారం యూనివర్సిటీని మూసివేశారు. సుమారు 1600మంది విద్యార్థుల జీవితాలను ఒక్క లెటర్‌తో రోడ్డున పడేశారు.
అసలీ విద్యార్థులు ఎందుకు మోసపోయారు? లక్షల కొద్దీ ఫీజులు గుంజుతున్న యూనివర్సిటీకి కళ్లుమూసుకుని డబ్బెలా చెల్లించారు? అమాయకంగా అమెరికాలో అడుగుపెట్టిన వీరిని.. అక్కడి పోలీసులు ఎందుకు అరెస్టు చేస్తున్నారు? అసలేం జరిగింది?
దేశంలోని అన్ని ప్రధాన నగరాలతో పాటు మన రాష్ట్రంలోని హైదరాబాద్, వరంగల్, విజయవాడ, వైజాగ్, తిరుపతి లాంటి సిటీల్లో ప్రతి సంవత్సరం కొన్ని సంతలు జరుగుతాయి. వివిధ దేశాల్లోని యూనివర్సిటీల ప్రతినిథులు ఏసీ గదుల్లో కూచుని విద్యార్థులకు కౌన్సెలింగ్ ఇస్తుంటారు. తమ యూనివర్సిటీకి ఉన్న పేరు, కోర్సులు, అవకాశాలు వంటి వాటిపై సుదీర్ఘమైన లెక్చర్లిస్తారు. ఆ యూనివర్సిటీలో చదవకపోతే.. అక్కడున్న వారి జీవితం వ్యర్ధమైనట్లే అని భావించేలా చేస్తారు. ఆ మైండ్ సెట్‌తో ఇళ్లకు వెళ్లిన విద్యార్థులు తల్లిదండ్రులను వేధించో.. బతిమాలో.. ఫారెన్ చదువులకు ఒప్పిస్తారు. ఉన్నవన్నీ తాకట్టు పెట్టించి, అప్పులు చేయించి.. లక్షల కొద్దీ డబ్బును ఆ యూనివర్సిటీ రిప్రజెంటేటివ్ కన్సల్టెన్సీల చేతుల్లో పోస్తారు. అలా.. ప్రతి ఏడాది.. రెండు మూడు సార్లు జరిగే సంతల్లోకి.. 2008లో ఓ యూనివర్సిటీ ప్రతినిథులు వచ్చారు. అది.. ట్రైవ్యాలీ యూనివర్సిటీ. ఆ యూనివర్సిటీ వెబ్‌సైట్ ప్రకారం.. హైదరాబాద్‌లోని రెండు కన్సల్టెన్సీలు వారికి రిప్రజెంటేటివ్స్‌గా వ్యవహరిస్తున్నాయి.
అందరిలాగే.. భవిష్యత్తు గురించి కలలు కన్న కొందరు స్టూడెంట్స్.. ఆశల సౌధాలను నిర్మించుకున్నారు. అమ్మానాన్నల వెంటబడి.. డబ్బుని చెల్లించారు. ఈ ప్రాసెస్‌లో అసలా యూనివర్సిటీకి అమెరికా ప్రభుత్వ గుర్తింపు ఉందోలేదో చెక్ చేయటం మర్చిపోయారు. ఒకవేళ ఆ కన్సల్టెన్సీ వారిని అడిగినా.. అక్రెడిటేషన్ వస్తుందని చెప్పి నమ్మించి ఉంటారు. అలా.. ఈ రెండేళ్లలో.. ఇండియాకు చెందిన 1400మందికి పైగా విద్యార్థులు అమెరికాలోని ప్లీసన్‌టన్ చేరుకున్నారు. అరగంట ప్రయాణంలో సిలికాన్ వేలీ ఉండటం.. అక్కడ తెలుగు వారు ఎక్కువగా నివసించడం, ఇండియాలోని తెలుగు విద్యార్థులను ఎక్కువగా ఈ యూనివర్సిటీ వైపు చూసేలా ప్రోత్సహించింది. యూనివర్సిటీలోని నాలుగు డిపార్ట్‌మెంట్లలోని ప్రొఫెసర్లలో ఎక్కువమంది తెలుగువారు కావటం.. ఇంగ్లీషు ఎక్కువగా రాని వారిని ఆకర్షించింది . తెల్ల వాళ్ళ లాండ్‌పై.. తెలుగోళ్ల మధ్య బతికేయవచ్చనే ఆశ.. బంధువులో, మిత్రులో అక్కడున్నారనే ధైర్యమో.. ట్రైవ్యాలీ యూనివర్సిటీలోని ఇండియన్లలో.. సుమారు 90శాతం మంది తెలుగు వారే అయ్యేలా చేసింది.
రెండేళ్లు బాగానే గడిచాయి. సంక్రాంతి పండగ కూడా బాగానే జరిగింది. అప్పటికే.. ఈ యూనివర్సిటీ కార్యకలాపాల మీద అనుమానం ఉన్న అధికారులకు కొన్ని సాక్ష్యాలు లభించాయి. ఆన్‌లైన్ విద్యావిధానంలో భోధించే ఈ విశ్వవిద్యాలయానికి ఎక్కువ వీసాలు మంజూరయిన విషయం కూడా వారు గమనించారు. ఇక కోర్సుల్లో రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థుల్లో ఎక్కువ మంది వేర్వేరు ప్రదేశాల్లో పనిచేస్తున్నట్లు ఆధారాలు దొరికాయి. అధికమొత్తంలో డబ్బు కట్టించుకుని.. అమెరికా చట్టాలకు వ్యతిరేకంగా.. స్టూడెంట్ వీసాలు ఇప్పించారని యూనివర్సిటీ డైరెక్టర్లపై కేసు నమోదు చేశారు. యూనివర్సిటీకి చెందిన రెండు ఆఫీసులను, విద్యార్థుల హాస్టళ్లను స్వాధీనం చేసుకున్నారు. నిరవధికంగా యూనివర్సిటీని మూసివేస్తూ అటార్నీ జనరల్ ఇచ్చిన ఆదేశాలను అమలుపరచారు.
అయితే.. ఇప్పుడు బాధంతా.. లక్షల రూపాయల డబ్బు కట్టించుకున్న యూనివర్సిటీని అర్ధంతరంగా మూసేశారని కాదు. ఆ యూనివర్సిటీ విద్యార్థులుగా రిజిస్టర్ చేసుకుని చదువుతున్నవారు, ఇప్పటికే కోర్సు కంప్లీట్ చేసుకుని ఉద్యోగ వేటలో ఉన్నవారి గురించే. అమెరికన్ చట్టాల ప్రకారం వీసా కోసం మోసం చేయటం నేరం. ఆ నేరంలో పాలుపంచుకున్న వారందరూ శిక్షార్హులు. ఇప్పుడు ఆ నేరంలో ఈ విద్యార్ధులు అందరూ ఇరుక్కున్నారు. ఎవరో కొంతమంది.. అమెరికాలో డబ్బు సంపాదించుకునేందుకు స్టూడెంట్ వీసాతో రావటం.. ఆ విద్యార్థులను కష్టాల్లో పడేసింది. చేయని తప్పుకి శిక్ష అనుభవించేలా చేస్తోంది. సుమారు పది రోజుల్నుంచి జరుగుతున్న ఈ వ్యవహారంతో.. వెయ్యిమంది తెలుగు విద్యార్థులు గదిలోంచి బయటకు రాకుండా భయంభయంగా గడుపుతున్నారు. కంటికి కునుకు, కడుపుకి తిండి దూరమై.. భవిష్యత్తు అంధకారమై.. అంతాకలిసి ఒక్కటిగా ఏడుస్తున్నారు. రోడ్డు మీదికొస్తే ఎక్కడ అరెస్టు చేస్తారో.. అన్న భయంతో.. ఆహారం తెచ్చుకోలేక.. తమ ఉనికిని బయటి ప్రపంచానికి తెలియనివ్వకుండా చీకటిలో.. మౌనంగా రోదిస్తున్నారు.
యూనివర్సిటీని మూయించిన పోలీసులు.. విద్యార్థుల వేట మొదలుపెట్టారు. దొరికిన వారిని అరెస్టు చేస్తున్నారు. మిగిలిన వారి ఆచూకీ చెప్పండంటూ వేధిస్తున్నారు. హంతకులు, తీవ్రవాదులకు బిగించినట్లుగా.. జిపిఎస్ ట్రాకర్లను తగిలిస్తున్నారు. ఆ జిపిఎస్ ట్రాకర్ల సహాయంతో.. ఎప్పుడు విచారణకు అవసరమైనప్పుడల్లా.. స్టూడెంట్ ఎక్కడున్నాడో తెలుసుకోవచ్చు. సరిగ్గా ఆ ప్రదేశానికి వెళ్లి బలవంతంగానైనా.. వారిని లాక్కెళ్లవచ్చు.
ఎక్కడైనా ఓ అమెరికన్‌కు చిన్న అపకారం జరిగిందంటే.. తోకతొక్కిన పాములా లేచే పెద్దన్నకు మిగిలిన ప్రజల మానమర్యాదలు పట్టటం లేదు. కనీస మర్యాద లేకుండా ప్రవర్తిస్తూ.. మానవ హక్కులకు తీవ్ర విఘాతం కలిగిస్తున్న అమెరికాకు, ఆ దేశ పోలీసులకు ఎదురుచెప్పే సాహసం మిగిలిన దేశాలకు లేదు.. ముఖ్యంగా ఇండియాకు. తాము ఇన్నాళ్లూ కష్టపడి చదివిన చదువు, తమ తల్లిదండ్రులు కూడబెట్టిన డబ్బు అన్యాయమైపోతోంటే చూడలేక.. చూస్తూ బతకలేక నరక వేదన పడుతున్న వారు.. ఏంచేయాలో తెలియక పిచ్చివాళ్లైపోతున్నారు.
ఇక ఈ విద్యార్థులను అక్కడికి పంపిన కన్సల్టెన్సీలు తమ తప్పేంలేదని వాదిస్తున్నాయి.
సుమారు వెయ్యిమంది విద్యార్థులు.. అదీ తెలుగు వాళ్లు.. అతిదీన పరిస్థితుల్లో ఉంటే.. మన ప్రభుత్వాలకి చీమ కుట్టినట్లైనా లేకపోయింది. యాత్రలు చేస్తూ మన ముఖ్యమంత్రి, అమ్మగారి అనుగ్రహంపై ప్రధానమంత్రి కాలం గడుపుతున్నారు. వారానికి పైగా సమయం వారు నరకం అనుభవించాక.. విపక్షాలు లేఖలు రాసిన తర్వాత.. తీరిగ్గా కేంద్రప్రభుత్వం స్పందించింది. ఆ విద్యార్థులకు కావలసిన న్యాయ సహాయం అందించాలని రాయబార కార్యాలయాన్ని ఆదేశించింది.
ట్రైవ్యాలీ యూనివర్సిటీ బాగోతం ఇప్పుడు వెలుగులోకి వచ్చింది కాబట్టి తెలుస్తోంది. మరి వందల సంఖ్యల్లో.. ఏడాదికి రెండు మూడు సార్లు అమెరికా, బ్రిటన్, జర్మనీ, స్విట్జర్లాండ్ లాంటి వివిధ దేశాలనుంచి వస్తున్న యూనివర్సిటీల ప్రతినిథులకు హెచ్చరికలు, అక్కడికి వెళ్లే విద్యార్థులకు సూచనలు చేయాల్సిన బాధ్యత ఎవరిది? డబ్బు కట్టించుకుని దొంగ వీసాలు ఇస్తున్న ట్రావెల్ ఏజన్సీలపై ఎటువంటి చర్యలు తీసుకుంటున్నాయి? ముందు వీసా ఇచ్చి.. ఆ తర్వాత రెండేళ్లకు ఆకులు పట్టుకున్న అమెరికాను ఏమనాలి? తప్పు చేసిన వారిని వదిలి అమాయకులను హింసిస్తూ మానవ హక్కుల ఉల్లంఘన చేస్తోన్న అక్కడి పోలీసులను ఏంచేయాలి? ఇవీ.. సగటు తెలుగోడి ప్రశ్నలు.. వీటికి సమాధానం ఎవరు చెబుతారు?
Update: భారత ప్రభుత్వ ఒత్తిడికి అమెరికా తలొగ్గింది. కాలిఫోర్నియాలోని ట్రై వ్యాలీ యూనివర్సిటీ వల్ల మోసపోయిన భారత విద్యార్థుల కోసం అమెరికా ఇమిగ్రేషన్, కస్టమ్స్ ఎన్‌ఫోర్స్‌మెంట్ హెల్ప్‌లైన్ ఏర్పాటు చేసింది. ఫారెన్ ఎఫైర్స్ మినిస్ట్రీని సంప్రందించడానికి ఇ మెయిల్ అడ్రస్, వాయిస్ మెయిల్ సౌకర్యాన్ని ఏర్పాటు చేశారు. సహాయం కావలసిన విద్యార్థులు
415 - 844-5320 అనే నెంబర్‌కు ఫోన్ లేదా వాయిస్ మెయిల్ చేయవచ్చు.
SFRHSIFraud@dhs.gov అనే ఈ మెయిల్ ఐడికి తమ కంప్లెయింట్లను పంపించవచ్చు.