14, మార్చి 2010, ఆదివారం

చెద పట్టిన చెట్టు నా ఆంధ్రప్రదేశ్!



ఆరోజుల్లో రెండు రకాల విత్తనాలను
కలిపి ఒక హైబ్రిడ్ విత్తనాన్ని తయారు చేశారు.

అన్నదమ్ముల ఇళ్ల మధ్య ఆ నాటిన ఆ విత్తనం
మొక్కై.. పెరిగి మానై పోయింది.
తియ్యటి పండ్లను ఆ ఇళ్ల యజమానులకు,
కొందరు కుటుంబ సభ్యులకు అందించింది.

ఏ ఇంటి అన్నదమ్ములు కలిసున్నారు?
మనస్ఫర్ధలొచ్చాయి. విడిపోదామనుకున్నారు.
ఇన్నాళ్లూ కలిసున్న వారికి అన్యాయం గుర్తొచ్చింది.
ఆ చెట్టు కాయలు నువ్వెక్కువ తీసుకున్నావని ఒకరంటే..
లేదు, ఆ చెట్టు కలప నువ్వే ఎక్కువ
వాడుకున్నావని మరొకరన్నారు.
కాయలు లేక మా వాళ్లు నీరసపడి
పోయారని ఒక కుటుంబ సభ్యుడంటే..
అసలు చెట్టు నీడ లేక
మా వాళ్లు ఎండలో మాడిపోతున్నారని
మరొక పెద్దమనిషి అన్నాడు.

చెట్టు కాండం ఉంది నీ చోటులోనే కదా అంటే..
కాయలు అందుతోంది నీకే కదా అని ఎదురు ప్రశ్న!

పెద్దలు తిట్టుకోవటం చూసి
ఇంట్లో పిల్లలు కొట్టుకోవటం మొదలుపెట్టారు.
చివరకు చెట్టుని పట్టించుకోవటం మానేశారు.

అప్పుడప్పుడూ పట్టే చెద
ఈసారి రెచ్చిపోయింది.
నాతో పాటూ వాడికి కూడా నష్టమేలే..
అని ఇరుపెద్దలు అనుకున్నారు.
చూస్తూ కూర్చున్నారు.
పిల్లలు ఒక కొమ్మమీద చెదను
మరో కొమ్మమీద ఒదిలిపెట్టారు.

ఇప్పుడు ఆ చెద
చెట్టునంతా ఆక్రమించింది.
కాండం సారమంతా పీల్చివేస్తోంది.
ఆకులు రాలిపోతున్నాయి.
చెట్టుపై పక్షులు ఎగిరి పోతున్నాయి.
అందమంతా తరిగిపోతోంది.

ఇప్పటికైనా మేల్కొనక పోతే
ఆ చెట్టుకి కాయలు కాయవు.
కాసినా రసంలేని పుచ్చిన కాయలు!
ఆ యింటి వాళ్లూ తినలేరు,
మరొకరికి ఇవ్వలేరు!!
చెదలు పట్టిన, ఆకులు రాలిన
ఆ చెట్టునీడ ఎందుకూ పనికి రాదు!
ఏ పక్షీ గూడు కట్టేందుకు ఆసక్తి చూపదు!!

11, మార్చి 2010, గురువారం

నా ఆత్మశాంతి కోసం!

అవును..
నేనేమీ రాజకీయ నిరుద్యోగిని కాను.
కొందరు నాయకుల చేతిలో కీలుబొమ్మనీ కాను.

నేను మేథావిని!

ఉన్న ఊరు, అమ్మ నాన్న తప్ప తెలియని
పదేళ్ల చిన్న పిల్లలు
"అన్నా, ఆ పార్టీ మీటింగెక్కడ?" అని
అడిగినప్పుడు వారి రాజకీయ చైతన్యానికి సలాం చేస్తాను!
భవిష్యత్తుకి బాటలు వేసే చదువులను
నడిరోడ్డుపై విసిరికొట్టి
ఆప్రాంతం వాడిని నరుకుతామని అంటుంటే
మేథావిగా వారికో వేటకొడవలి ఇచ్చి
వెళ్లిరమ్మని ఆశీర్వదిస్తాను!

ఏదో నాకు తెలిసిన
చరిత్ర అంతా తిరగేసినా కూడా
ఒక్క రాజకీయనాయకుడు..
నాలాంటి ఒక్క మేథావి..
కూడా ఇప్పటివరకూ చావలేదు.
కనీసం చావటానికి ప్రయత్నించలేదు.
ఎప్పుడూ సోదర విద్యార్థులే..
యువతరం ప్రతినిథులే!
ఆ సంస్కృతి మారకుండా
నాకు చేతనైనంత మందిని నేనూ
చావటానికి ప్రోత్సహిస్తాను!

ఒకచోట పరీక్షలు జరుగుతుంటాయి..
మరోచోట ఆగిపోతూనే ఉంటాయి..
ఒకచోట ఉద్యోగాలు చేసుకుంటారు.
మరోచోట ఉద్యమాలు చేసుకుంటారు.
మేథావిగా నేను మాత్రం
వాళ్ల మథ్య తేడా పెంచేందుకు
ఒకరినొకరు తిట్టుకునేందుకు
అపార్థాలు పెంచుకునేందుకు
పదబంధాలు తయారుచేస్తాను!

నాలుగు రోజులు జీవితం
ప్రశాంతంగా ఉందనుకుంటే చాలు..
ఒకరి ఆత్మ బలిదానం తప్పనిసరి!
మీకేంటి? మామాట విని చనిపోతారు..
ఓపాట పాడి శాశ్వతంగా పడుకోబెడతాం! 
మరొకరు మరణించేదాకా
మామాటలు జనం వినేదాకా
ఆ వేడి రగులుతూనే ఉండాలి!
లేకపోతే మేమెట్లా చలి కాచుకునేది?

ఒకప్పుడు చదువుకున్నోడు మేథావి..
బతుకు బాగుపడే దారి చూపే వాడు మేథావి..
పక్కవాడిని తనతో కలుపుకు పోయే వాడు మేథావి..

నేను కూడా ఒకప్పుడు మేథావి వర్గానికి చెందిన వాడినే.
ఇప్పుడు రాజకీయనాయకులు నన్ను కలిపేసుకున్నారు!

ఎందుకో మరి!
చనిపోయిన సోదరుల ఆత్మలు నాచుట్టూ తిరుగుతున్నట్లు..
మా చావులకి సమాధానం చెప్పమని అడుగుతున్నట్లూ..
నాకు నేను చనిపోయేలా ఎందుకు రెచ్చగొట్టావని ప్రశ్నిస్తున్నట్లూ..
రాజకీయ నాయకులకీ నీకూ తేడా ఏంటని తిడుతున్నట్లూ..
ఒకటే ఆలోచనలు!

నా చుట్టూ తిరుగుతున్న ఆత్మలు పిరికివి
కాకపోతేఈ పాటికే నా హత్య జరిగుండేది!
మేథావిగా ఆత్మహత్య చేసుకోవటం తప్ప మరోదారి లేదు.

ఇప్పుడు నాలాంటి మేథావుల ఆత్మశాంతికోసం మీరో పాట పాడండి!

8, మార్చి 2010, సోమవారం

వీళ్లూ మనుషులే!

వాళ్లని చూస్తే భయం..
వాళ్లంటే కోపం..
అవకాశం వస్తే వాళ్లపైకి దాడికి దిగుతాం!
రాళ్లూ కర్రలతో వెంటపడి తరుముతాం!!

మరి వాళ్లు ఊరుకుంటారా?
మనకి దొరికినట్లే వాళ్లకు కూడా అవకాశం దొరుకుతుంది కదా!?

వాళ్లు ఉన్నన్నాళ్లూ మనం ఎవరి మాటా వినం..
మనం మాట విననన్నాళ్లు వాళ్లూ వెళ్లరు..

ఇదిగో ఇలా..



ఆర్నెళ్లుగా ఇంటిని,
కట్టుకున్న పెళ్లాన్నీ, కన్నబిడ్డలనీ వదిలి
గాలికి, ధూళికి ఫుట్‌పాత్‌పై సేద తీరుతుంటారు..
శరీరాన్ని చలికి అప్పగిస్తారు!