11, మార్చి 2010, గురువారం

నా ఆత్మశాంతి కోసం!

అవును..
నేనేమీ రాజకీయ నిరుద్యోగిని కాను.
కొందరు నాయకుల చేతిలో కీలుబొమ్మనీ కాను.

నేను మేథావిని!

ఉన్న ఊరు, అమ్మ నాన్న తప్ప తెలియని
పదేళ్ల చిన్న పిల్లలు
"అన్నా, ఆ పార్టీ మీటింగెక్కడ?" అని
అడిగినప్పుడు వారి రాజకీయ చైతన్యానికి సలాం చేస్తాను!
భవిష్యత్తుకి బాటలు వేసే చదువులను
నడిరోడ్డుపై విసిరికొట్టి
ఆప్రాంతం వాడిని నరుకుతామని అంటుంటే
మేథావిగా వారికో వేటకొడవలి ఇచ్చి
వెళ్లిరమ్మని ఆశీర్వదిస్తాను!

ఏదో నాకు తెలిసిన
చరిత్ర అంతా తిరగేసినా కూడా
ఒక్క రాజకీయనాయకుడు..
నాలాంటి ఒక్క మేథావి..
కూడా ఇప్పటివరకూ చావలేదు.
కనీసం చావటానికి ప్రయత్నించలేదు.
ఎప్పుడూ సోదర విద్యార్థులే..
యువతరం ప్రతినిథులే!
ఆ సంస్కృతి మారకుండా
నాకు చేతనైనంత మందిని నేనూ
చావటానికి ప్రోత్సహిస్తాను!

ఒకచోట పరీక్షలు జరుగుతుంటాయి..
మరోచోట ఆగిపోతూనే ఉంటాయి..
ఒకచోట ఉద్యోగాలు చేసుకుంటారు.
మరోచోట ఉద్యమాలు చేసుకుంటారు.
మేథావిగా నేను మాత్రం
వాళ్ల మథ్య తేడా పెంచేందుకు
ఒకరినొకరు తిట్టుకునేందుకు
అపార్థాలు పెంచుకునేందుకు
పదబంధాలు తయారుచేస్తాను!

నాలుగు రోజులు జీవితం
ప్రశాంతంగా ఉందనుకుంటే చాలు..
ఒకరి ఆత్మ బలిదానం తప్పనిసరి!
మీకేంటి? మామాట విని చనిపోతారు..
ఓపాట పాడి శాశ్వతంగా పడుకోబెడతాం! 
మరొకరు మరణించేదాకా
మామాటలు జనం వినేదాకా
ఆ వేడి రగులుతూనే ఉండాలి!
లేకపోతే మేమెట్లా చలి కాచుకునేది?

ఒకప్పుడు చదువుకున్నోడు మేథావి..
బతుకు బాగుపడే దారి చూపే వాడు మేథావి..
పక్కవాడిని తనతో కలుపుకు పోయే వాడు మేథావి..

నేను కూడా ఒకప్పుడు మేథావి వర్గానికి చెందిన వాడినే.
ఇప్పుడు రాజకీయనాయకులు నన్ను కలిపేసుకున్నారు!

ఎందుకో మరి!
చనిపోయిన సోదరుల ఆత్మలు నాచుట్టూ తిరుగుతున్నట్లు..
మా చావులకి సమాధానం చెప్పమని అడుగుతున్నట్లూ..
నాకు నేను చనిపోయేలా ఎందుకు రెచ్చగొట్టావని ప్రశ్నిస్తున్నట్లూ..
రాజకీయ నాయకులకీ నీకూ తేడా ఏంటని తిడుతున్నట్లూ..
ఒకటే ఆలోచనలు!

నా చుట్టూ తిరుగుతున్న ఆత్మలు పిరికివి
కాకపోతేఈ పాటికే నా హత్య జరిగుండేది!
మేథావిగా ఆత్మహత్య చేసుకోవటం తప్ప మరోదారి లేదు.

ఇప్పుడు నాలాంటి మేథావుల ఆత్మశాంతికోసం మీరో పాట పాడండి!

5 comments:

Ravi చెప్పారు...

This is excellent....
మేథావులంటూ చెప్పుకుని తిరుగుతూ సమాజంలో అశాంతిని ప్రేరేపించే వాళ్ళకి చెంప మీద కొట్టినట్లుంది.

Apparao చెప్పారు...

చాలా బాగా వ్రాసారు
హాట్స్ ఆఫ్

హను చెప్పారు...

chala bagumdi, nice one

అజ్ఞాత చెప్పారు...

hey buddy... this is BTR.. nice poetry..

అజ్ఞాత చెప్పారు...

superb.. mee satire on so called medhavi is excellent!

కామెంట్‌ను పోస్ట్ చేయండి